సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణము. మకర సంక్రమణము నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభము అవుతుంది. ఆ తరువాత కుంభ, మీన, మేష,వృషభ, మిథున రాశులలో కొనసాగినంత కాలము ఉత్తరాయణము. శారీరక పరిశ్రమకు, పూజలకు, సాధనలకు, కృషికి అనువైన, ఆవశ్యకత ఉన్న కాలము ఉత్తరాయనము.కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన దగ్గరినుండి మొదలై, ఆ తరువాతసింహ, కన్య, తుల, వృశ్చికం, ధనూ రాశులలో కొనసాగినంత కాలము దక్షిణాయణము. మానసికమైన అర్చనకు,ధ్యానానికీ, యోగానికీ, దీక్షలకు,బ్రహ్మచర్యానికి, నియమ నిష్టలకు అనువైన, ఆవశ్యకత ఉన్న కాలము దక్షిణాయణము. పన్నెండు నెలల సంవత్సర కాలములో ఆరు నెలల దక్షిణాయణము దేవతలకు ఒక రాత్రి, ఆరు నెలల ఉత్తరాయణము దేవతలకు ఒక పగలు. కనుక దేవతలు మేలుకునే కాలము ఉత్తరాయణ పుణ్య కాలము. కనుకనే ఉత్తరాయనము వరకూ ఎదురు చూసి ఉత్తరాయణము ప్రవేశించిన తర్వాత తనువును చాలించాడు మహానుభావుడైన భీష్ముడు.
“సంక్రాంతి” లేదా “సంక్రమణం” అంటే చేరుట అని అర్ధం. జయసింహ కల్పద్రుమం అనే గ్రంథంలో “సంక్రాంతి”ని ఇలా విర్వచించారు – తత్ర మేషాదిషు ద్వాదశ రాశి క్రమణేషు సంచరతః సూర్యస్య పూర్వస్మాద్రాశే ఉత్తరః రాశౌ సంక్రమణ ప్రవేశః సంక్రాంతిః – మేషం మొదలైన 12 రాశులలో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుండి తరువాతి రాశిలోనికి ప్రవేశించడమే సంక్రాంతి. సూర్యుని చలనంలో (రధయాత్రలో) ఘట్టాలు నాలుగు. అవి మేష, తుల, కటక, మకర సంక్రమణాలు. వీటిలో మకర సంక్రమణాన్ని “సంక్రాంతి పండుగ”గా వ్యవహరిస్తారు.మార్గశిరం పూర్తి కాగానే ఉత్తరాయణం మొదలవుతుంది.
భోగి పండుగలో నాలుగు మార్గాల కూడలిలో వేయబడే పెద్ద మంట. అప్పటి నుండి ఇంతకంటే మరింత వేడితో ఉత్తరాయణ సూర్యుడు రాబోతున్నడనే సంకేతం. దక్షణాయంలో ఉండే నిద్ర బద్దకంతో సహా దగ్ధం చేయాలనే సంకేతంతో చీకటితోనే బోగిమంట వేస్తారు. ఇంట్లో ఉండే పాత కలపసామానులు, వస్తువులు, ఎండుకొమ్మలు లాంటివి బోగి మంటలో వేసి తగులబెడుతారు. వీటన్నిటినీ దారిద్ర్య చిహ్నాలుగా బావించి తగులబెట్టాలంటారు. వేసవిలో వేడికి తగులబడే వాటిని గుర్తించాలనే మరొక సంకేతం కూడా ఇందులో దాగిఉంది.
భోగిపళ్ళు
భోగి పండ్లు అంటే రేగుపండ్లు. ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన పండుగ. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపండ్లతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. సూర్య భగవానుని అనుగ్రహం పిల్లలపై ప్రసరించి ఆరోగ్యం కలగాలనే సంకేతంతో బోగిపండ్లు పోస్తారు.
తిల తర్పణం
సంవత్సరంలో మిగిలిన రోజులలో నల్ల నువ్వులు వాడరు. కాని సంక్రాంతి పర్వధినాన మాత్రం నల్లనువ్వులతో మరణించిన పిత్రుదేవతలందరికీ తర్పణములివ్వడం ఎక్కువగా చేస్తుంటారు. దీన్నే పెద్దలకు పెట్టుకోవడం అంటుంటారు. సంక్రాంతి పర్వధినాలలో వారి వారి ఆచార సంప్రదాయాలను అనుసరించి ఈ కార్యక్రమము చేస్తుంటారు. ఈ రోజు బూడిద గుమ్మడి కాయ దానము ఇస్తారు.
సంకురుమయ / సంక్రాంతి పురుషుడు
మట్టితో ఒక బొమ్మను (సంక్రాంతి పురుషుడు), తన వాహనాన్ని (ప్రతి సంవత్సరం వేరు వేరు వాహనాల పై పురుషుడు వస్తాడు. ఏ వాహనాన్ని ఎక్కితే ఆ వాహనానికి ఆ సంవత్సరం ఎక్కువ నష్టము అని ఒక నమ్మకం), మేళ తారళాలను చేసి, సంక్రాంతి మూడు రోజుల్లో పూజలు చేస్తారు. నాల్గవ నాడు ఈ బొమ్మలను వాల్లాడిస్తారు.
హరిదాసు
గొబ్బిళ్ళతో ఇంటి ముందరి భాగాన్ని అలంకరించి హరిని కీర్తించే భక్తులకు సాక్షాత్ శ్రీకృస్ణుడే హరిదాసు రూపంలో వస్తాడని సంకేతం. ఆయన తలమీద మంచి గుమ్మడి కాయా ఆకారంలో గల పాత్ర గుండ్రముగా ఉండే భూమికి సంకేతం దాన్ని తలమీద పెట్టుకొని ఉండటం శ్రీ హరి అయిన తానే భూమిని ఉద్దరిస్తున్నానని { ఉత్+దరించు= తలమీద పెట్టుకోవడం} అని చెప్పే దానికి సంకేతం. హరినామ కీర్తన చేస్తూ రావడం తను ఏ భోగాలకూ లొంగను కేవలం హరినామ సంకీర్తనకే వచ్చే వాడిననీ తనకు తమపర భేదాలు లేవనీ అందుకే ప్రతి ఇంటికీ తిరుగుతూ వస్తాడనే సంకేతం.
గంగిరెద్దు
ముందు వెనుకల చెరో ప్రమదునితో {శివ గణం} ఎత్తైన మూపురం శివలింగాకృతిని గుర్తుచేస్తూ శివునితో సహా తను సంక్రాంతి సంభరాలకు హాజరయ్యానని చెప్పే సంకేతం గంగిరెద్దు. ఆవు లేదా ఎద్దు ఇంటి ముందు ముగ్గులో నిలిచిందంటే ఆనేల ధర్మభద్దమైనదని అర్ధం. “జుగోప గోరూప ధరామివోర్విం” దీని అర్ధం ఆ నేల ఆవుకి సంకేతం ఆనేలనుండి వచ్చిన పంటకు సంకేతం ముంగిట నిలిచిన వృషభం. మీరు చేసే దానమంతా ధర్మభద్దమేనంటూ దానిని మేము ఆమోదిస్తున్నామని ఇంటింటికీ తిరుగుతుంటారు వృషభసహిత శంకర పరివారం.
ముగ్గులు
రాళ్ళూ రప్పలూ లేకుండా ఒక పద్ధతిలో అలకబడిన నేల, మేఘాలు లేని ఆకాశానికి సంకేతం. ఒక పద్ధతిలో పెట్టబడు చుక్కలు రాత్రి వేళ కనిపించే నక్షత్రాలకు సంకేతం. చుక్కలచుట్టూ తిరుగుతూ చుక్కలను గళ్ళలో ఇమిడ్చే ముగ్గు ఖగోళంలో ఎప్పడికప్పుడు కనిపించే మార్పులకు సంకేతం. ఎంత పెద్దదైనా చిన్నదైనా ముగ్గు మధ్య గడిలో పెట్టే చుక్క సూర్యు స్థానానికి సంకేతం. ఇంకొక దృక్పథంలో గీతలు స్థితశక్తికి (స్టాటిక్ ఫోర్స్),చుక్కలు గతిశక్తి (డైనమిక్ ఫోర్స్)కు సంకేతాలని, ముగ్గులు శ్రీ చక్ర సమర్పనా ప్రతీకలని శక్తి తత్త్వవేత్తలు అంటారు. ఇక వివిధ ఆకారాలతో వేయు ముగ్గులు విల్లు ఆకారం పునర్వసు నక్షత్రానికీ, పుష్పం పుష్యమీ నక్షత్రానికీ పాము ఆకారము ఆశ్లేష కూ, మేక, ఎద్దు, పీత, సింహం, ఇలాంటివి మేష, వృషభ, మిధున, కర్కాటక రాసులకూ, తొమ్మిది గడుల ముగ్గు నవగ్రహాలుకూ సంకేతాలుగా చెప్పచ్చు.
రధం ముగ్గు
మూడు రోజులతో పూర్తవుతూ అందరికీ ఆనందాన్ని పంచే పండుగను ఘనంగా సాగనంపేందుకు పుట్టినదే రధం ముగ్గు. అందరూ ఒకరికి ఒకరు తోడుంటూ కలసి సహజీవనం సాగించాలి అనే సంకేతాలతో ఒక రథం ముగ్గు తాడును మరొక ఇంటి వారి ముగ్గుతో కలుపుతూ పోతూంటారు.