ఏపీ రాజధానిపై మంత్రి బొత్స చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. 2024 వరకు హైదరాబాద్ ఏపీకి ఉమ్మడి రాజధాని అంటూ కొత్త వాదనను బొత్స తెరపైకి తీసుకురావడం చర్చనీయాంశమైంది. అది కూడా, అమరావతిపై హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో బొత్స వ్యాఖ్యలు గందరగోళానికి గురిచేసేలా ఉన్నాయి. దీంతో, బొత్స వ్యాఖ్యలపై పలువురు విపక్ష నేతలు మండిపడుతున్నారు. జగన్ ను హైదరాబాద్ నుంచి పాలన చేయాలంటూ సెటైర్లు వేస్తున్నారు.
అమరావతిపై హైకోర్టు తీర్పు నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు బొత్స ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడుతున్నారు. మంత్రి బొత్స మళ్లీ హైదరాబాద్ రావాలనుకుంటున్నారని, ఇక్కడే మరో రెండేళ్లు ఉండాలనుకుంటున్నారని టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి కూడా కామెంట్లు చేశారు. జగన్ మూడు రాజధానుల వ్యవహారాన్ని వదిలేసినట్లు కనిపిస్తోందంటూ చురకలంటించారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు స్పందించారు.
హైదరాబాదే ఏపీ రాజధాని అంటూ బొత్స చేసిన వ్యాఖ్యలు ప్రజలను గందరగోళంలో పడేస్తున్నాయని అయ్యన్న అన్నారు. హైదరాబాద్ కు వెళితే జగన్ ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తారంటూ అయ్యన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు 3 రాజధానులు అని చెప్పి, ఇప్పుడు హైదరాబాద్ రాజధాని అని చెప్పడమేంటోనని ఎద్దేవా చేశారు. ఇలాంటి తుగ్లక్ మాటలు మాట్లాడొద్దని బొత్సకు చురకలంటించారు.
వైసీపీ నేతలకు ఇలా చెప్పడం వెన్నతోపెట్టిన విద్య అని, గత నవంబరుకే పోలవరం నుంచి నీళ్లిస్తామని మంత్రి అనిల్ కుమార్ గొప్పగా చెప్పారని, మార్చి నెల గడచినా నీళ్ల జాడ లేదని అయ్యన్న ఎద్దేవా చేశారు.