అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘ HEALTHY GIRL-HEALTHY FUTURE’ (ఆరోగ్యకరమైన బాలికలతోనే ఆరోగ్యకరమైన భవిష్యత్తు) కార్యక్రమాన్ని నిర్వహించారు. మార్చి 8న ఈ క్యాంపెయిన్ కు సంబంధించిన తొలి క్యాంప్ ను కృష్ణా జిల్లా నాగాయలంక గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు స్కాలర్స్ కాన్వెంట్ లలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 250 మందికి పైగా విద్యార్థినులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ తేజస్వి పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాలలోని ఆడపిల్లలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు, వాటి పరిష్కారాలపై విద్యార్థినులకు డాక్టర్ తేజస్వి అవగాహన కల్పించారు. ఆ తర్వాత విద్యార్థినులందరికీ ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహించి హిమోగ్లోబిన్ శాతం ఎంత ఉందో పరిశీలించారు. రక్తహీనతను అధిగమించేందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చారు. వారు పాటించవలసిన ఆహార నియమాలు, డైట్ చార్ట్ ను అందించారు. అనంతరం, విద్యార్థినులుకు విటమిన్స్, కాల్షియమ్ టాబ్లెట్స్, సానిటరీ పాడ్స్ పంపిణీ చేశారు.
9 నుంచి 14 సంవత్సరముల మధ్య వయసున్న అమ్మాయిలు HPV వాక్సిన్ ను 6 నెలల వ్యవధిలో రెండు డోసులు తీసుకోవాలని ప్రోగ్రాం కోఆర్డినేటర్ చెరుకూరి చాముండేశ్వరి సూచించారు. అలా చేయడం వల్ల మహిళలలో ఎక్కువగా వచ్చే Cervical Cancer ను నివారించవచ్చని ఆమె తెలిపారు. ఇటువంటి విషయాలపై విద్యార్థినులకు అధ్యాపకులు అవగాహన కల్పిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి ‘ప్రియాంక వల్లేపల్లి’ స్పాన్సర్ గా వ్యవహరించారు. ఈ ప్రోగ్రాం కోఆర్డినేటర్స్ గా తానా ఫౌండేషన్ సెక్రటరీ శశికాంత్ వల్లేపల్లి, తానా నార్త్ సెంట్రల్ RVP సాయి బొల్లినేని మరియు పద్మజ బెవర వ్యవహరించారు. తానా ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ, తానా ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి లావు మరియు స్వచ్ఛ నాగాయలంక సేవా సభ్యులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తమ వంతు సహాయసహకారాలందించారు.