గత రెండు రోజులుగా ఇరు తెలుగు రాష్ట్రాలలో గవర్నర్ల వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ తమిళిసై ప్రసంగం లేకుండానే ప్రారంభించడంపై విమర్శలు వస్తున్నాయి. బీజేపీని టార్గెట్ చేసిన సీఎం కేసీఆర్…గవర్నర్ వ్యవస్థనే అవమానించారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక, ఏపీలో అయితే, ప్రభుత్వానికి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అనుకూలంగా వ్యవరిస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
నిన్న అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం వినుకండా వాకౌట్ చేసి మరీ తమ నిరనస వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తో పాటు గవర్నర్ల వ్యవస్థ మీద సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వివాదాస్ప వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ కు గవర్నర్ విశ్వభూషణ్ హెడ్ క్లర్క్‌గా మారిపోయారని నారాయణ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. అంతటితో ఆగని నారాయణ…కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏపీ గవర్నర్ బ్రోకర్‌గా మారిపోయారంటూ షాకింగ్ కామెంట్లు చేశారు.
ఏపీ గవర్నర్ హరిచందన్ లాంటి వారి వల్ల మొత్తం గవర్నర్ల వ్యవస్థపైనే నమ్మకం పోతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒడిశాకు చెందిన బీజేపీ సీనియర్ మోస్ట్ నేత అయిన బిశ్వభూషణ్ హరిచందన్ ను ఏపీ గవర్నర్‌గా మోదీ సర్కారు గతంలో నియమించింది. వివాదాల జోలికి వెళ్లకుండానే విశ్వభూషణ్ ఉంటున్నారు. కానీ, ఇటీవలి కాలంలో జగన్ చెప్పిందనల్లా చేస్తున్నారని, ఆయన రబ్బర్ స్టాంప్‌గా మారిపోయారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
గవర్నర్ పేరు మీద అప్పులు తెచ్చినా…ఆయన నోరు మెదపలేదని విమర్శలు గుప్పిస్తున్నాయి. అందుకే, గతంలో ఎన్నడూ లేని రీతిలో టీడీపీ నిన్న అసెంబ్లీలో నిరసన వ్యక్తం చేయగా… తాజాగా సీపీఐ నారాయణ కూడా గవర్నర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.