నాటి ప్రభుత్వంలో పూనందే కీలక పాత్ర
వైద్య, ఆరోగ్యశాఖలో మహారాణి
నే డు అదే సర్కారుపై తీవ్ర విమర్శలు
జగన్ మెప్పుకోసం అనుచిత వ్యాఖ్యలు
మెడ్‌టెక్ జోన్ విషయంలో
అభియోగాలు ఎత్తివేసినందుకే!
పూనం మాలకొండయ్య.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయమే అక్కర్లేని పేరు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సమర్థ అధికారిణి అన్న పేరు గడించారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఆమె కీలకంగా వ్యవహరించారు. వైద్య ఆరోగ్యశాఖను మహారాణిలా ఏలారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఆమెకు ప్రాధాన్యం తగ్గించేందుకు ప్రయత్నించారు.
వైద్య ఆరోగ్య శాఖ నుంచి తప్పించి వ్యవసాయ శాఖకు బదిలీచేశారు. ఆ తర్వాత పశుసంవర్ధక శాఖకు పంపారు. మళ్లీ ఏమైందో.. తిరిగి వ్యవసాయ శాఖనూ అప్పగించారు. ఇంతవరకు బాగానే ఉంది. పూనం ఇటీవల జగన్‌పై తన స్వామిభక్తి చాటుకోవడానికి.. చంద్రబాబు ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు ఐఏఎస్ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.
‘పశు సంవర్ధక శాఖ మొదటి సమీక్షా సమావేశం జరిగినప్పుడు రాష్ట్రంలో పాల ఉత్పత్తి ఎలా ఉందని ముఖ్యమంత్రి అడిగారు. దేశవ్యాప్తంగా మన రాష్ట్రం 4వ స్థానంలో ఉందని మేం చాలా గర్వంగా చెప్పాం. 154 లక్షల లీటర్లు ఉత్పత్తి చేస్తున్నామని చెప్పాం. అప్పుడు సార్ (సీఎం) అన్నారు… బానే ఉంది.. పాడి రైతులకు ఇస్తున్న ధరలో దేశంలో మీ స్థానం ఎక్కడ ఉందని. అట్టడుగులో ఉంది సార్ అని మేం మెల్లగా చెప్పాం. (సీఎం జగన్ ఓ నవ్వు నవ్వారు.) సార్ ఎందుకని అడిగారు. మేం ఏం చెప్తాం? కానీ మీ అందరికీ తె లుసు. గత పాలకుల నిర్లక్ష్యంతో నిర్వీర్యమైన పాడిసంఘాలు, చిన్నాభిన్నమైన పాడిరైతుల బతుకు బాగు చేయడంలో తీసుకున్న నిర్ణయమే జగనన్న పాలవెల్లువ కార్యక్రమం’ అని రాజకీయ నేత తరహాలో మాట్లాడారు.
రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఓ అధికారి హోదాలో ఉంటూ గత ప్రభుత్వ వైఫల్యం అంటూ రాజకీయ వ్యాఖ్యానాలు చేస్తారా అని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్ అధికారులు, ఐఏఎస్ వర్గాలు సైతం ఆ వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు.
ముఖ్యమంత్రి, మంత్రులు గత ప్రభుత్వ పనితీరు గురించి మాట్లాడితే రాజకీయంగా వ్యాఖ్యలు చేశారనుకోవచ్చు. కానీ గత ప్రభుత్వంతోపాటు ఈ ప్రభుత్వంలోనూ అధికారి హోదాలో కీలక బాధ్యతల్లో పనిచేస్తున్న ఆమె.. మున్నెన్నడూ లేని రీతిలో జగన్ సర్కారుకు దాసోహమై.. అనూహ్యంగా ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక ఏం జరిగి ఉంటుంది? ఎందుకోసం ఇలా మాట్లాడి ఉంటారని చర్చోపచర్చలు సాగుతున్నాయి.
నాడు పూనం మాటకు ఎంతో విలువ
సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన పూనం గత తెలుగదేశం ప్రభుత్వ హయాంలో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేశారు. నాటి ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఆ శాఖ ఉన్నతాధికారిణిగా తనదైన ముద్రవేశారు. ఆమెకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చేవారు. ఆ శాఖ మంత్రి, ఇతర అధికారులకన్నా పూనం మాటకే నాటి ప్రభుత్వం విలువ ఇచ్చేది. దీంతో వైద్య, ఆరోగ్యశాఖ అంటే ఆమె బాస్ అన్న పేరు మార్మోగింది.
అప్పట్లో వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలో జరిపిన కొనుగోళ్లు, ప్రత్యేకించి విశాఖలో మెడ్‌టెక్ జోన్ ఏర్పాటు, అందులో జరిగిన అంశాలపై జగన్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ (ఏసీబీ) మెడ్‌టెక్ జోన్‌పై విచారణ జరిపి కొన్ని కీలకమైన అంశాల్లో పూనం పేరును తెరపైకి తెచ్చింది.
ఆమెపై పలు అభియోగాలు మోపుతూ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దీనిపై సీఐడీతో పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ప్రభుత్వం భావించి ఫైలు కదిలించింది. కానీ ఏం జరిగిందో ఏమో ఆ ఫైలు ఇక అంతకు మించి ముందుకుసాగలేదు. ఆ కొంతకాలానికే ఆమెపై ఉన్న అభియోగాలను తొలగిస్తూ సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. అంటే గత ప్రభుత్వంలో వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శిగా కీలక పాత్ర పోషించిన ఆమె జగన్ సర్కారు చేపట్టిన విచారణల ల పర్వంలో మెడ్‌టెక్ జోన్ విషయంలో ముప్పు ఎదుర్కొన్నారు.
ఆ తర్వాత అదే సర్కారు ఆదేశాలతో బయటపడ్డారు. సీఐడీ విచారణ జరగకముందే ఆమెపై ఉన్న అభియోగాలను తొలగించేశారు. సీఎం జగన్ చేసిన మేలుకు కృతజ్ఞతగా స్వామి భక్తిని చాటుకునేలా గత ప్రభుత్వ వైఫల్యాలు అని ఆమె మాట్లాడారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె వ్యాఖ్యలపై ఐఏఎస్ వర్గాలు సైతం విస్మయం చెందుతున్నాయి.
‘ప్రభుత్వాలు వస్తుంటాయి. పోతుంటాయి. కానీ అధికార వ్యవస్థ శాశ్వతంగా ఉంటుంది. ఒక్కసారి ఓ వ్యక్తి సర్వీసులో చేరితే కనీసం 35 ఏళ్లపైనే ప్రజలకు సేవ చేయాల్సి ఉంటుంది. కానీ రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చాక వాటి కాలపరిమితి ఐదేళ్లే. ఈ విభజన చాలా స్పష్టంగా ఉంది. అధికారులు ఆ ప్రభుత్వంలో పనిచేసినా.. ఈ ప్రభుత్వంలో పనిచేసినా చట్టబద్ధంగానే విధులు నిర్వహిస్తారు. రాజకీయాల గురించి పట్టించుకోకూడదు. గతంలో ఆమె వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేసినప్పుడు ఆ శాఖ వ్యవహారాల్లో ఆమె విఫలమయ్యారా.. విజయం సాధించారా? ఆ శాఖ వైఫల్యాల్లో ఆమె పాత్ర ఏమిటో అంచనా వేసుకోవాలి. అదే సమయంలో పశు సంవర్ధకశాఖలో మరో సీనియర్ అధికారి పనిచేశారు. డెయిరీ విషయంలో ఆయన తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని.. రైతులు అన్యాయమైపోతున్నారని.. వారికి సరైన ధర అందడం లేదని నాటి ప్రభుత్వానికి పూనం నివేదిక ఇచ్చారా? పోనీ ఆ పరిస్థితిని మార్చాలని లిఖిత పూర్వకంగా కోరారా? లేక సదరు సీనియర్ అధికారి తన విధులు నిర్వహించడంలో విఫలమయ్యారా? తన వ్యాఖ్యల ద్వారా పూనం చెప్పదలుచుకున్నదేమిటి’ అని ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రశ్నించారు.
ఆమె వ్యాఖ్యలు సీఎం జగన్‌పై స్వామి భక్తిని చాటుకునేలా ఉన్నాయన్న ప్రచారం అధికార వర్గాల్లో సాగుతోంది. పూనం మాత్రమే కాదు.. సీనియర్ జూనియర్ అన్న తేడా లేకుండా ప్రస్తుతం నవ్యాంధ్రలో దాదాపు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లంతా జగన్ సర్కారుకు జీ హుజూర్ అంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి.