స్థానిక ఎన్నికల్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కు తగులుతున్న ఎదురుదెబ్బలు అన్ని ఇన్ని కావు. ఒకపక్క రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా లేదని చెప్పటం.. సర్కారు బాటలోనే ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు.. ఎన్నికల నిర్వహణలో తాము పాలు పంచుకోలేమని తేల్చేయటం తెలిసిందే. ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లుగా తేల్చేశారు.
దీంతో.. ఎన్నికల నిర్వహణ కోసం నిమ్మగడ్డ ప్రభుత్వ ఉద్యోగులకు రెండు పేజీల లేఖ రాశారు. అందులో పలు ఆసక్తికర అంశాల్ని ప్రస్తావించారు. అందరి సహకారంతో ఎన్నికల్ని నిర్వహిద్దామని ప్రభుత్వ ఉద్యోగులకు పిలుపునిచ్చిన ఆయన.. విధి నిర్వహణలో మీకెవ్వరూ సరిరారంటూ పొగడ్తల వర్షం కురిపించారు. పోలింగ్ సిబ్బంది భద్రతకు పూర్తి చర్యలు తీసుకుంటామని చెప్పిన ఆయన.. పోలింగ్ విధులకు హాజరయ్యే సిబ్బందికి కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్న భరోసా ఇచ్చారు.
పోలింగ్ విధులకు హాజరయ్యే ఉద్యోగులకు పీపీఈ కిట్లు.. ఫేస్ షీల్డ్ లు సరఫరా చేస్తామన్నారు. ఎన్నికల విధుల్ని బహిష్కరిస్తామంటూ ఉద్యోగ సంఘాలు తేల్చినప్పటికి.. వారిపై విమర్శలు చేయని నిమ్మగడ్డ.. అందుకు భిన్నంగా ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీ ఉద్యోగులతో సాటి ఎవరూ రారని.. విపత్తుల వేళ.. వారు ఎంతో కీలకంగా పని చేసి గుర్తింపు పొందినట్లు పేర్కొన్నారు.
స్థానిక ఎన్నికల్లో కూడా అదే సంకల్పంతో పని చేయాలని పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా స్థానిక సంస్థల ఎన్నికల్ని నిర్వహించాల్సిన అవసరం ఉందన్న ఆయన.. అందరూ కలిసి రావాలన్నారు. ఓవైపు ప్రభుత్వ ఉద్యోగుల్ని ప్రశంసిస్తూనే.. మరోవైపు రాజకీయ పార్టీలపై వ్యాఖ్యలు చేయటం గమనార్హం. స్థానిక ఎన్నికల్ని నిర్వహించాలనే రాజకీయ పార్టీలు కోరుకుంటున్నాయని.. పార్టీలతో తాము నిరంతరం సంప్రదింపులు జరుపుతామనే చెప్పారు.పంచాయితీ ఎన్నికల్ని నిర్వహిస్తేనే ఆర్థిక సంఘం నిధులు వస్తాయన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మొత్తంగా స్థానిక ఎన్నికల్ని ఏదోలానిర్వహించాలన్న గట్టి ప్రయత్నంలో నిమ్మగడ్డ ఉన్నారన్న విషయం తాజా లేఖ స్పష్టం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణకు ససేమిరా అంటున్న ప్రభుత్వం మరెలాంటి ఎత్తులు వేస్తుందో చూడాలి.