భారత్- రష్యా మధ్య ఉన్న సంబంధాలపై అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ దేశాల మధ్య ఉన్న సంబంధం విలక్షణమైందని పేర్కొంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి నెడ్‌ప్రైస్ ఇలా స్పందించారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను ఖండిస్తూ ఐరాస భద్రతా మండలిలో శనివారం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో ద్వారా అడ్డుకుంది. ఈ ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. ఈ నేపథ్యంలోనే అమెరికా ప్రతినిధి నెడ్ ప్రైస్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతం సంతరించుకుంది.
భద్రతా మండలి ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉండడంపై అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ స్పందించారు. రష్యాతో భారత్‌కు విలక్షణ సంబంధం ఉన్న విషయం తమకు తెలుసని ఆయన చెప్పారు. భారత్‌తో ముఖ్యమైన విలువలు, ప్రయోజనాలను పంచుకుంటున్నామని తమ మధ్య విస్త్రృత వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని ఆయన పేర్కొన్నారు. అంతే కాకుండా రష్యాతో భారత్‌కు ఉన్నటువంటి సంబంధాలు తమకు లేవని ఆయన స్పష్టం చేశారు.
“మాకు భారత్‌తో చాలా ముఖ్యమైన ప్రయోజనాలున్నాయి. భారత్- అమెరికా అత్యంత ముఖ్యమైన విలువలను పంచుకుంటున్నాయి. అయితే అమెరికా- రష్యా మధ్య ఉన్న సంబంధాల కంటే భారత్- రష్యా మధ్య ఉన్న సత్సంబంధాలు ఉన్నట్లు మాకు తెలుసు. రక్షణ, భద్రత రంగం సహా వివిధ రంగాల్లో భారత్- రష్యా మధ్య సంబంధాలున్నాయి. పలుకుబడి ఉన్న దేశాలన్నీ దాన్ని నిర్మాణాత్మక పద్ధతిలో ఉపయోగించాలని అన్ని దేశాలను కోరాం” అని నెడ్ ప్రైస్ తెలిపారు.
మరోవైపు ఓటింగ్‌కు దూరంగా ఉన్నా భారత్‌ను అభినందిస్తున్నట్లు రష్యా పేర్కొంది. “భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్ సందర్భంగా భారత్ స్వతంత్రంగా వ్యవహరించింది. బ్యాలెన్స్డ్గా వ్యవహరించినందుకు ఎంతగానో అభినందిస్తున్నాం. వ్యూహాత్మక భాగస్వామ్య స్పూర్తితో ఉక్రెయిన్ విషయమై భారత్‌తో సన్నిహితంగా సంప్రదింపులు జరిపేందుకు రష్యా కట్టుబడి ఉంది” అని భారత్‌లోని రష్యా రాయబార కార్యాలయం పేర్కొంది.