ఏపీ సీఎం జగన్ ధాటిని తట్టుకొని వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం అంత సులభం కాదు. ఈ విషయం తెలుసు కాబట్టే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటినుంచే వచ్చే ఎన్నికల కోసం కసరత్తులు మొదలెట్టారు. టీడీపీని బలోపేతం చేసే దిశగా సాగుతున్నారు. నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారు. 2024 ఎన్నికలకు ఇప్పటినుంచే రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాబు ఎప్పుడూ లేని నయా ట్రెండుకు శ్రీకారం చుట్టేలా కనిపిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నివేదికల ఆధారంగా..
రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాలపై బాబు ప్రత్యేక దృష్టి సారించారు. అక్కడి నేతల పనితీరు, పార్టీ పరిస్థితిపై విశ్లేషిస్తున్నారు. సర్వేలు చేయించి నివేదికలు కూడా తెప్పించుకుంటున్నారు. ఈ నివేదికల ఆధారంగా ఎన్నికలకు ఏడాది ముందుగానే అభ్యర్థులను ప్రకటించి వారిని జనంలోకి పంపాలన్నది బాబు ఆలోచనగా తెలుస్తోంది. గతంలో చంద్రబాబు చివరి వరకూ అభ్యర్థులను ప్రకటించే వారు కాదు.
గత కొన్ని ఎన్నికల నుంచి ఆయన ఇదే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. కానీ ఇప్పుడు దాన్ని మార్చాలని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం. అందుకే తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక సందర్భంగా పనబాక లక్ష్మీని ముందుగానే ప్రకటించారు. బద్వేలు ఉప ఎన్నికకూ ముందుగానే అభ్యర్థిని ప్రకటించిన ఆ తర్వాత తప్పుకున్నారు.
ప్రజల్లోకి వెళ్లాలని..
గత ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం సాధించింది. కానీ ఆ ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనపై కొన్ని వర్గాల ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే టాక్ ఉంది. దారుణంగా మారిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పడకేసిన అభివృద్ధి, పెరుగుతున్న అప్పులు.. ఇలా కొన్ని కారణాల వల్ల ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుందని తెలిసింది. ఈ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బాబు ప్లాన్ వేశారు.
అందుకే ముందుగానే అభ్యర్థులను ప్రకటించి వాళ్లను జనాల్లోకి పంపిస్తే అధికార పార్టీ వైఫల్యాల గురించి వాళ్లు వివరించి ఓటర్ల మద్దతు పొందే అవకాశం ఉంటుందని బాబు భావిస్తున్నారు. అందుకే నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేసి అభ్యర్థుల ఎంపికపై ఓ నిర్ణయానికి వస్తున్నారు. పులివెందుల నుంచి బీటెక్ రవికి టికెట్ ఇస్తానని ఇప్పటికే బాబు స్పష్టం చేశారు.
పొత్తులు కూడా కారణం..
మిగిలిన స్థానాల్లోనూ అభ్యర్థులను త్వరగా ప్రకటిస్తే వాళ్లు ప్రచారం చేసుకోవడానికి సమయం దొరుకుతుందని బాబు భావిస్తున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో బాబు పొత్తులతో బరిలో దిగే అవకాశం ఉంది. అందుకే ముందుగా టీడీపీ బలంగా ఉన్న 50 నుంచి 70 నియోజకవర్గాల్లో ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తే మిగతా వాటిల్లో పొత్తుల ప్రకారం ముందుకు సాగొచ్చని బాబు చూస్తున్నారు. మే నెలలో మహానాడు పూర్తయిన వెంటనే అభ్యర్థుల ఎంపికపై బాబు స్పీడ్ పెంచే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.