భీమ్లానాయక్ చిత్రం పై ఏపీ ప్రభుత్వం రివేంజ్ తీసుకుంటోందన్న సంగతి చర్చనీయాంశమైంది. సరిగ్గా ఈ సినిమా విడుదలకు ముందే థియేటర్లకు జగన్ ప్రభుత్వం ముందస్తు నోటీసులు ఇవ్వడం, తనిఖీలు, సోదాలు అంటూ రచ్చ చేయడంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు సహా పలువురు ప్రతిపక్ష నేతలు ఈ వ్యవహారంపై స్పందించారు. ఈ క్రమంలోనే తాజాగా పవన్‌కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కూడా బాసటగా నిలిచారు.
అంతేకాదు, ఏపీలో సినీ పరిశ్రమను ప్రభుత్వం టార్గెట్ చేసిందని ప్రధాని మోడీకి రఘురామ లేఖ రాశారు. టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం వల్ల సినీ రంగంలోని వేలాది మంది రోడ్డునపడుతున్నారని, థియేటర్లు మూసేసుకుంటున్నారని లేఖలో పేర్కొన్నారు. ఆల్రెడీ సినిమా షోలు, టికెట్ ధరలపై నిబంధనలున్నాయని, ఇప్పుడు ప్రత్యేకంగా ఇలా బెదిరింపు ధోరణిలో నోటీసులివ్వడం ఏమిటని ఆర్ఆర్ఆర్ మండిపడ్డారు. సరిగ్గా ఈ చిత్రం విడుదల సమయంలోనే రూల్స్ గుర్తుకురావడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇటువంటి చర్యలను వెంటనే ఆపేయాలని డిమాండ్ చేశారు.
తాను చెప్పినట్లే జరిగిందని, అరచేతితో సూర్యకాంతిని ఆపలేరని పవన్ కు మద్దతుగా కొటేషన్ చెప్పారు. లాలా భీమ్లా.. అడవి పులి గొడవపడి.. ఒడిసిపట్టు దంచికొట్టు.. కత్తిపట్టు అదరగొట్టు అంటూ భీమ్లా నాయక్ చిత్రంలోని పవన్ ఇంట్రడక్షన్ పాటను ట్వీట్ చేశారు. దీంతోపాటు, ” I’m with #BheemlaNayak” రఘురామ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సినిమా విజయం సాధించిన సందర్భంగా.. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి, భీమ్లా నాయక్ యూనిట్‌కు రఘురామ శుభాకాంక్షలు తెలిపారు.