ప్రస్తుతం ఏపీలో భీమ్లా నాయక్ చిత్రం రాజకీయ, సినీవర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఓ పక్క భీమ్లా నాయక్ హిట్ టాక్ తో దూసుకుపోతూ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. మరోపక్క సినిమా టికెట్ల రేట్ల పేరుతో పవన్ ను జగన్ టార్గెట్ చేశారని విపక్ష నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యవహారంలోకి తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంట్రీ ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశమైంది.
ఏపీలో భీమ్లా నాయక్ సినిమా స్పెషల్ షోలు, బెనిఫిట్ షోలకు అనుమతిని జగన్ సర్కార్ ఇవ్వని సంగతి తెలిసిందే. అదే సమయంలో తెలంగాణలో ఆ సినిమాకు అదనపు షోలకు అనుమతులివ్వడంతో పాటు టికెట్ రేట్లను 15 రోజుల పాటు పెంచుకునే వెసులుబాటు కల్పించారు. ఈ క్రమంలోనే కేసీఆర్ పై పవన్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తూ. ఈ నేపథ్యంలోనే విజయవాడలోని కృష్ణలంకలో సీఎం కేసీఆర్, పవన్ కళ్యాణ్, దివంగత వంగవీటి మోహనరంగ, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, జనసేన నేత నాదెండ్ల మనోహర్ లఫొటోలతో భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు పవన్ ఫ్యాన్స్. కేసీఆర్ను ఉద్దేశించి హ్యాట్సాఫ్ సీఎం సర్ అంటూ ఫ్లెక్సీపై రాశారు.
అయితే, ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు…ఆ ఫ్లెక్సీని కార్పొరేషన్ సిబ్బందితో తొలగించారు. దీంతో, ఈ ఫ్లెక్సీ తొలగింపు వ్యవహారం విజయవాడలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఫ్లెక్సీని కక్ష సాధింపు చర్యగా తొలగించారని, వైసీపీ నాయకులు కట్టిన ఫ్లెక్సీలు రోడ్డుకి అడ్డంగా ఉన్నా పట్టించుకోవడం లేదని జనసేన నేతలు అంటున్నారు. అడ్డుగా ఉంటే అన్ని ఫ్లెక్సీలు తొలగించాలని పవన్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.