జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. అఖండ, పుష్పల తర్వాత విడుదలవుతున్న ఈ భారీ సినిమా కోసం ఇండస్ట్రీతోపాటు పవన్ అభిమానులు కూడా ఎంతగానో ఎదురుచేస్తున్నారు. కానీ,అందరూ అనుకున్నట్లుగానే ఏపీలో ఈ సినిమాపై జగన్ సర్కార్ కక్ష సాధిస్తూ టికెట్ రేట్లు తగ్గించే అమ్మాలని నిర్ణయించింది.
అంతేకాదు, సరిగ్గా సినిమా విడుదలకు ముందు రోజు థియేటర్లపై దాడులు, తనిఖీలు, సోదాలు అంటూ వేధింపులకు దిగిందని పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. దీంతో, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు నష్టపోతారని వాపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సీఎం జగన్ కు పల్నాడు ప్రాంతంలోని పవన్ ఫ్యాన్స్ షాకిచ్చారు. గుంటూరు జిల్లా మాచర్లలోని ఓ థియేటర్ దగ్గర డిస్ట్రిబ్యూటర్ల కోసం హుండీ ఏర్పాటు చేశారు. అందులో తమకు తోచినంత చందాలు వేసి డిస్ట్రిబ్యూటర్లకు పంపుతామని పవన్ ఫ్యాన్స్ చెబుతున్నారు.
భీమ్లానాయక్ సినిమా బెనిఫిట్, స్పెషల్ షోలకు ఏపీలో అనుమతులు లేవని అధికారులు చెబుతున్నారు. అంతేకాదు, థియేటర్లో అదనంగా కుర్చీలు వేసినా సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలోనే థియేటర్లు, డిస్ట్రిబ్యూటర్లను నష్టాల కొంతైనా గట్టెక్కించేందుకు గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పవన్ అభిమానులు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. మాచర్ల పట్టణంలోని నాగార్జున కళామందిర్ థియేటర్లో డిస్ట్రిబ్యూటర్ల కోసం విరాళాల సేకరణకు హుండీ ఏర్పాటు చేశారు.
రూ.70, 50,30..టికెట్ రేట్లుగా ఫిక్స్ చేశారని, ఆ రేట్ల ప్రకారం అయితే డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు వస్తాయని మాచర్ల పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు వాపోతున్నారు. అందుకే వారికోసం హుండీ ఏర్పాటు చేశామని,ఇది చూసైన జగన్ మనసు మారి ఆయన టికెట్ రేట్ల విషయంలో మంచి మార్గంలో నడవాలని కోరుకుంటున్నామన్నారు. అంతేకాదు, రేట్లు ఇలాగే తక్కవగా ఉంటే…ఒకటికి నాలుగు సార్లు సినిమా చూసి కలెక్షన్లు పెంచుతామంటున్నారు. దీంతో, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రభుత్వ విప్, జగన్ కు సన్నిహితుడు, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంటికి కూతవేటు దూరంలో ఉన్న థియేటర్లో ఇలా హుండీ ఏర్పాటు చేసి జగన్ పరువును పవన్ ఫ్యాన్స్ తీశారని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.