ఏపీలో అప్పులు…వాటి కోసం జగన్ పడుతున్న తిప్పలు…కొద్ది నెలలుగా ఏపీతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఏపీలో జనంపై జగన్ అప్పుల భారం మోపుతున్నారని విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ అప్పుల తిప్పలపై ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ప్రజలకు షాకింగ్ అప్ డేట్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏపీలో ప్రతీ కుటుంబంపై రూ.5లక్షల అప్పు భారాన్ని జగన్ మోపారని చంద్రబాబు ఆరోపించడం చర్చనీయాంశమైంది.
అంతేకాదు, జగన్ చేసే అప్పులు ఎవరూ కట్టరని.. రేపు ప్రజలే కట్టాలని చంద్రబాబు చెప్పడంతో ప్రజల్లో ఆలోచన మొదలైంది. ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్లు పెడుతున్నారని, రాష్ట్రాన్ని జగన్ అప్పుల ఊబిలోకి నెట్టేశారని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్ర జనాభా 5 కోట్లు అని…రెండున్నరేళ్లలో జగన్రెడ్డి రూ.7లక్షల కోట్ల అప్పులు చేశారని చంద్రబాబు మండిపడ్డారు. ఈ క్రమంలోనే చంద్రబాబు వ్యాఖ్యలకు ఊతమిచ్చేలా ఏపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ సర్కారు తీరు చూస్తుంటే బెండు అప్పారావు సినిమా గుర్తుకు వస్తోందని ఐవైఆర్ సెటైర్లు వేశారు. సంక్షేమం పేరుతో జగన్ చేస్తున్న అప్పులు.. భవిష్యత్తులో ఏపీ ప్రజలపైనే పడనున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. పప్పు బెల్లాల్లాగా జగన్ లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తున్న సొమ్ము జగన్ సొంత సొమ్ము కాదని ఐవైఆర్ విమర్శించారు. బడ్జెట్ను ఎలా రూపొందించకూడదో ఏపీ ప్రభుత్వాన్ని చూస్తే తెలిసిపోతుందని ఎద్దేవా చేశారు.
ఏపీ ప్రభుత్వం తన బడ్జెట్ లో రూ.37 వేల కోట్లను అప్పుగా ప్రతిపాదించి, ఆ వెంటనే రూ.57 వేల కోట్లను అప్పుగా తెచ్చిందని విమర్శించారు. ఆదాయం చూసుకోకుండా ఖర్చు పెట్టిన వారు బాగుపడిన దాఖలాలు లేవని గుర్తు చేశారు.