- రూ.25 వేల కోట్ల మేర పన్నుల బాదుడు, ధరల మోతతో గుల్ల
- ఒకటి కాదు, రెండు కాదు…
- విద్యుత, చెత్త పన్ను, ఇంటిపన్ను, పెట్రోల్, రిజిస్ర్టేషన్, సహజ గ్యాస్, ఇసుక..ఏదైనా బాదుడే
- మద్యం, రేషన్ సరుకులు, ఆర్టీసీ, వృత్తి పన్ను…చెప్పుకుంటే దేన్నీ వదల్లేదు
- పన్నుల మోత…ధరల వాతగా గడిచిన ఏడాది
- బాబు హయాంలో ఐదేళ్ల పాటు ఒక్క రూపాయి పెరగని విద్యుత్ ఛార్జీలు, రేషన్ ధరలపై భారీగా బాదిన జగన్
కాదేదీ పన్నుకు అనర్హం. దేనిమీదైనా పన్ను వేసేద్దామన్న సిద్ధాంతంగా గడచిన ఏడాదంతా జగన్ సర్కారు పన్నుల మోత మోగించేసింది. ఒకటీ రెండు కాదు.. పదుల సంఖ్యలో కొత్త పన్నులు వేసింది. ఉన్న పన్నులు పెంచింది. పన్నుల కోసమే కొత్త ఆలోచనలు చేయడం ఈ ప్రభుత్వ ప్రత్యేకత.
జనం గగ్గోలు పెట్టినా, ఇవేం పన్నులని మొత్తుకున్నా కనికరం చూపించిన పాపాన పోలేదు. గల్లాపెట్టె నింపుకోవడానికి ప్రజల ఆదాయాలకు కత్తెర వేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో తొలి ఐదు నెలల్లోనే పన్నులు పెంచడం ద్వారా రూ.12 వేల కోట్ల అదనపు భారం వేసింది. ఇందులో మద్యంపై ధరల పెంపు ద్వారా రూ.4,500 కోట్లు.. పెట్రోల్, డీజిల్‌పై రోడ్డు డెవలప్మెంట్ టాక్స్ ద్వారా రూ.600 కోట్లు, ప్రజల ఇళ్లపై పన్ను రూ.2 వేల కోట్లు, ఆఖరికి చెత్తపన్ను రూ.350 కోట్లు, ప్రొఫెషనల్ టాక్స్‌పై రూ.161 కోట్లు.. ఇలా వివిధ వర్గాల ప్రజలను బాదేసింది.
ఇవే కాదు.. ఇసుక, రేషన్ సరుకుల ధరల పెంపు, ఆర్టీసీ చార్జీల పెంపు, రిజిస్ర్టేషన్ చార్జీల పెంపు, విద్యుత బిల్లుల పెంపు, ఇసుక ధరల పెంపు.. ఇలా 2021లో దాదాపు రూ.25వేల కోట్ల మేరకు బాదింది. ఆ ఉత్సాహంతో కొత్త సంవత్సరంలోనూ మరింత పన్నుల మోతెక్కించనుంది..
విద్యుత బిల్లుల షాక్…రేషన్ సరుకులతో పరేషాన్
గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల సమయంలో ఒక్కసారి కూడా పెంచని వాటిపైనా జగన్ సర్కారు భారీగా బాదేసింది. విద్యుత చార్జీల రూపంలో కొట్టిన దెబ్బకు జనం షాకయ్యారు. దొంగచాటుగా శ్లాబులు మార్చి, మాయ చేసి, ఏమార్చింది. గ్రామాల్లో ఒక్కో మధ్యతరగతి ఇంటికి గతంలో రూ.200 వచ్చే విద్యుత బిల్లు.. ఇప్పుడు సగానికి సగం పెరిగిపోయింది.
పట్టణాలు, నగరాల్లో రూ.500 వచ్చే బిల్లులు కూడా సగానికి సగం పెరిగిపోయాయి. పైసా పెంచలేదని ప్రభుత్వం బుకాయిస్తున్నా.. ప్రజలకు మాత్రం చార్జీల పెంపు అనుభవంలోకి వచ్చేసింది. ఇది చాలదన్నట్లు ట్రూఅప్ ్జల పేరుతో మోత మోగించేశారు. అయితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ తర్వాత వెనక్కితగ్గారు.
రేషన్ సరుకుల ధరలు…గత పాలకులు, అంతకుముందు పాలకులు కూడా ఎప్పుడూ పెంచలేదు. వాటిని కూడా ఇప్పుడు విపరీతంగా పెంచేశారు. కందిపప్పు కిలో రూ.40 నుంచి ఏకంగా రూ.67కు పెంచేశారు. పంచదార అరకిలో రూ.17కు పెంచేశారు. మద్యంపై పెంచిన ధరలతోనే పేదలు, మధ్యతరగతి నుంచి వేల కోట్లు వసూలుచేశారు.
అమ్మ ఒడి డబ్బులు…నాన్న బుడ్డికి చెల్లు అన్న విమర్శలు వచ్చినా వెరవలేదు. ఇసుక ధరలను దారుణంగా పెంచేశారు. గతంలో ట్రాక్టర్ ఇసుక గ్రామాల్లో రూ.1300కి వస్తే ఇప్పుడు రూ.4,500 పెట్టాల్సి వస్తోంది. అంటే మూడున్నర రెట్లు పెంచేశారు. ప్రభుత్వానికి దీనివల్ల ఏటా సుమారు రూ.700 కోట్ల అదనపు ఆదాయం వస్తోంది.
పెట్రోల్, డీజిల్ ధర లు అత్యంత ఎక్కువ ఉన్న రెండో రాష్ట్రం మనదే. కేంద్రం పెంచిన ధరల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికీ వీటిపై పన్నులు పెరిగాయి. ఉదాహరణకు ఈ ప్రభుత్వం రాకముందు పెట్రోల్ లీటరు రూ.65 ఉంటే.. దానిలో రాష్ట్ర పన్నులు 31శాతం. ఇప్పుడు పెట్రోల్ రూ.110 ఉంటే…దానిలో 31శాతం వాటా. ఇది చాలదన్నట్లు మళ్లీ పెట్రోల్, డీజిల్‌పై రోడ్డు డెవలప్మెంట్ ట్యాక్స్ పేరుతో రూ.600 కోట్లు లాగేసింది.
జార్ఖండ్‌లాంటి చిన్న రాష్ట్రాలు, కేరళ, తమిళనాడు లాంటి పొరుగు రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తగ్గించలేదు. మరోవైపు ఇంటింటికీ తక్కువ ధరకే ఇంటర్నెట్, టెలిఫోన్, టీవీ కార్యక్రమాలు చూసేందుకు గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటుచేసిన ఫైబర్‌నెట్ కనెక్షన్ కింద నెలకు రూ.149 వసూలు చేయగా…దాన్ని కూడా రెట్టింపు చేసేశారు. కొత్త ఏడాదిలో ఏ కొత్త ఐడియాతో పన్నులు మరింతగా పెంచి తమ బతుకులు దుర్భరం చేస్తారోనని జనం ఆందోళన చెందుతున్నారు.