తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగాలకు చెందిన నేతలు, పార్టీ నేతలు ప్రభుత్వంపై పోరాడటం లేదంటూ చంద్రబాబునాయుడు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం పార్టీ ఆఫీసులో అనుబంధ విభాగాల అధ్యక్షులతో చంద్రబాబు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయకుండా కేవలం మీడియా సమావేశాలకు మాత్రమే పరిమితమవుతున్నట్లు మండిపోయారు. ఇలాంటి వారి చిట్టా తన దగ్గరుందని హెచ్చరించారు.
పార్టీ అధ్యక్షుడిగా తానిచ్చిన పోరాటాలకు కూడా చాలామంది నేతలు ఎందుకు మొహం చాటేస్తున్నారంటూ నిలదీశారు. ప్రజలతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయకుండా కేవలం పార్టీ ఆఫీసుల చుట్టు మాత్రమే తిరుగుతుంటే ఏమిటి ఉపయోగమని నిలదీశారు.
ఎవరెవరు ఏమి చేస్తున్నారో తాను గమనిస్తున్నట్లు చంద్రబాబు హెచ్చరించారు. పదవులు తీసుకుని క్రియాశీలంగా పనిచేయకపోతే ఏమిటి ఉపయోగమంటు ప్రశ్నించారు. ఇప్పటికైనా నేతలు మేల్కొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని చెప్పారు.
జనాలతో మమేకమై కార్యకర్తలను ముందుండి నడిపించని నేతలపై కఠిన చర్యలు తీసుకోవటానికి కూడా వెనకాడేది లేదంటు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. అనుబంధ విభాగాల పనితీరు, వాటి అధ్యక్షుల వ్యవహారంపై చంద్రబాబు సుదీర్ఘంగా సమీక్షించారు. ఉండటానికి పార్టీకి అనుబంధంగా 17 విభాగాలున్నా కేవలం రెండు మూడు విభాగాలు మాత్రమే సక్రమంగా పనిచేస్తున్నట్లు చెప్పారు.
రాబోయే కాలం పార్టీకి చాలా కీలకమని కాబట్టి అందరు క్రియాశీలకంగా పనిచేయాల్సిందే అని స్పష్టంగా చెప్పారు. ఎవరికైనా పోరాటాలు చేయటానికి ఇబ్బంది అనిపిస్తే వెంటనే రాజీనామా చేసేయాలన్నారు. లేకపోతే తానే యాక్షన్ తీసుకోవటం ఖాయమని హెచ్చరించారు.
పార్టీ అనుబంధ సంఘాల్లో మహిళలకు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలని అధ్యక్షులకు సూచించారు. మరి తాజాగా చంద్రబాబు చేసిన హెచ్చరికలు పార్టీ నేతలపైన పనిచేస్తుందేమో చూడాలి. నిజానికి అనుబంధ సంఘాల అధ్యక్షులే కాదు చాలమంది ఎంఎల్ఏలే పోరాటాల్లో పాల్గొనటం లేదు. కాబట్టి చంద్రబాబు వారిని కూడా దారిలోకి తెచ్చుకుంటేనే కార్యకర్తల్లో జోష్ పెరుగుతుంది.