పార్లమెంటులో చాలా సేపు మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన చేతకాని తనాన్ని తానే బయట పెట్టుకున్నారా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎలాంటి సంబంధం లేకుండానే 2014లో జరిగిన రాష్ట్ర విభజన అంశాన్ని మోడీ ప్రస్తావించారు. పైగా యూపీఏ ప్రభుత్వం చేసిన అడ్డగోలు విభజనతో ఇటు తెలంగాణ అటు ఏపీ నష్టపోయిందని బాధపడిపోయారు. విభజన సక్రమంగా జరగకపోవటం వల్లే రెండు రాష్ట్రాల మధ్య ఇంకా విధ్వేషాలు కంటిన్యూ అవుతున్నాయంటు ఆందోళన వ్యక్తంచేశారు.
ఇక్కడ గమనించాల్సిందేమంటే రాష్ట్ర విభజన అంశం జరిగిన తీరు అందరికీ తెలుసు. విభజనలో ఏపీకి ఏ స్ధాయిలో అన్యాయం జరిగిందో అందరికీ బాగా తెలుసు. విభజన పాపం కాంగ్రెస్ కు ఎంతుందో బీజేపీకీ అంతే ఉంది. కాబట్టి అందరికీ తెలిసిన చరిత్ర గురించి చెప్పాల్సిన అవసరం లేదు మోడీకి. ఇదే సందర్భంలో యూపీఏ ప్రభుత్వం ఏపీకి జరిగిన అన్యాయాన్ని తర్వాత వచ్చిన నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏ విధంగా సరి చేసింది ? ఏపీకి నిజంగానే అంత అన్యాయం జరిగిందనే భావన మోడీలో ఉంటే మరి న్యాయం చేయటానికి ఎందుకు ప్రయత్నించలేదు.
విభజన చట్టంలో చెప్పిన ప్రత్యేక హోదా, వైజాగ్ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ అంశాన్ని తుంగలో తొక్కేసిందే మోడీ. పోలవరం నిర్మాణానికి అవసరమైన నిధులు ఇవ్వకుండా బాగా సతాయిస్తోంది. ఏపీకి జరుగుతున్న అన్యాయం జనాలకు కనబడుతోంటే ఇంకా తామేదో ఏపీని ఉద్ధరించేస్తున్నట్లు మోడీ ప్రభుత్వం ఫోజులు కొడుతోంది. గడచిన ఎనిమిదేళ్లుగా ఏపీని దెబ్బకొడుతు తన చేతకాని తనాన్ని మోడీనే పార్లమెంటు సాక్షిగా బయటపెట్టుకున్నట్లే ఉంది. కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని ప్రస్తావించిన మోడి ఆ అన్యాయం బీజేపీ మద్దతు వల్లే జరిగిందన్న విషయాన్ని అంగీకరించినట్లయ్యింది.
ఏదేమైనా ఏపీకి ఎప్పుడో జరిగిపోయిన అన్యాయాన్ని ఇపుడు మోడీ అసందర్భంగా ఎందుకు ప్రస్తావించారో ఎవరికీ అర్థం కావడం లేదు. విభజన చట్టాన్ని మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కేసిన విషయంపై జనాలంతా మండిపోతున్నారు. ఎప్పుడో ఏపీకి అన్యాయం జరిగిందని ఇపుడు మొసలి కన్నీరు కారుస్తున్న మోడీ తాను ఎనిమిదేళ్ళుగా ఏ విధంగా న్యాయం చేశారో చెప్పులేకపోవటమే విచిత్రంగా ఉంది. అంటే తాను ఏపీకి న్యాయం చేయలేదని అంగీకరించినట్లే అయ్యింది. మొత్తానికి ఎందుకు మాట్లాడినా పార్లమెంట్ సాక్షిగా తన చేతకానితనాన్ని తానే బయటపెట్టుకున్నారనే చర్చ పెరిగిపోతోంది.