జగన్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వారిలో పలువురు మంత్రులు నియోజకవర్గాలకే పరిమితమయ్యారనే వాదన బలంగా వినిపిస్తోంది. వాస్తవానికి మంత్రి అంటే.. ఎక్కడికి వెళ్లినా.. రెడ్ కార్పెట్ స్వాగతాలు, ప్రొటోకాల్ మర్యాదలు.. ఇలా అనేక రూపాల్లో హంగు, ఆర్భాటాలు ఉంటాయి. పైగా వైసీపీలో మంత్రులకు ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా.. వెంటనే సీఎంవో రంగంలోకి దిగుతోంది. లోపాలపై సదరు జిల్లా అధికారులకు క్లాస్ ఇస్తోంది. మరి అలాంటి పరిస్థితిలో మంత్రులు జిల్లాలనేకాదు.. రాష్ట్రాన్ని ఏలుతున్న పరిస్థితి ఉంది. అయితే.. దీనికి భిన్నంగా నలుగురు మంత్రులు మాత్రం నియోజకవర్గాలకే పరిమితం కావడం ఇటు పార్టీలోను, అటు ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అవంతి పరిస్థితి ఇలానే ఉందని అంటున్నారు పరిశీలకులు. గత ఏడాది ఎన్నికలకు ముందు టీడీపీ ఎంపీగా ఉన్న అవంతి.. వైసీపీలోకి వచ్చి.. భీమిలి టికెట్ సాధించి.. గెలుపు గుర్రం ఎక్కారు అంతేకాదు.. మంత్రిగా కూడా మంచి ఛాన్స్ దక్కించుకున్నారు. తర్వాత కాలంలో ఆయన దూకుడు చూపించారు. ముఖ్యంగా జగన్ దగ్గర మంచి మార్కులు కొట్టేసేందుకు.. తన మాజీ బాస్ టీడీపీ అదినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. అనేక సందర్భాల్లో అనేక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రాజధాని విషయంలో వైసీపీ వ్యూహానికి తగిన విధంగా పావులు కదిపారు. విశాఖను రాజధానిగా చేయడంపై చంద్రబాబు మనసులో మాట చెప్పాలంటూ.. ఆయనను బాగానే ఇరికించారు. ఇలా దూసుకుపోయిన అవంతి.. కొన్నాళ్లుగా మాత్రం మౌనం పాటిస్తున్నారు.
సీఎం సొంత జిల్లా కడపకు చెందిన కడప ఎమ్మెల్యే మైనార్టీ నాయకుడు, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కూడా కడప నియోజకవర్గానికే పరిమితమయ్యారు. వాస్తవానికి ఈయన మిత భాషి. అయినంత మాత్రాన.. మంత్రిగా ఉన్నారు కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఆయన తిరిగేందుకు , తన వర్గం వారి సమస్యలు పరిష్కరించేందుకు అవకాశం ఉంది. అయినా.. మౌనం వహిస్తు న్నారు.
ఇక, విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం నుంచి వరుస విజయాలు సాధించిన ఎస్టీ నాయకురాలు, డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి కూడా కొన్నాళ్లుగా ఎక్కడా కనిపించడం లేదు. కేవలం నియోజకవర్గానికి, ఇంటికే పరిమితమయ్యారు.
ఇక, అమలాపురం ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు పినిపే విశ్వరూప్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. మరి ఈ నలుగురికి ఏమైంది? ఎందుకు వీరు మౌనంగా ఉంటున్నారు? అనే ప్రశ్నలకు పలు రకాల సమాధానాలు వినిపిస్తున్నాయి.
మంత్రి అవంతి విషయంలో పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ సాయిరెడ్డి దూకుడు కారణంగానే ఆయన మౌనం పాటిస్తున్నారని ప్రచారంలో ఉంది. ఇక, అంజాద్ బాషా విషయంలో ప్రభుత్వ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఉన్నారని అంటున్నారు. వీరి దూకుడుతో ఆయన సైలెంట్ అయ్యారని సమాచారం. ఇక, పుష్ప శ్రీవాణికి , మంత్రి బొత్సకు ఆది నుంచి పడడం లేదు. దీనికి తోడు ఇంటి వాతావరణం కూడా పుష్ప శ్రీవాణికి కలిసిరావడం లేదు. దీంతో ఆమె కూడా మౌనం పాటిస్తున్నారు. పినిపే పరిస్థితి కూడా ఇలానే ఉంది. అగ్రవర్ణ నేతల ఆధిపత్యంతో ఆయన మౌనం వహిస్తున్నారని ప్రచారంలో ఉంది. మొత్తానికి ఆ నలుగురు మంత్రులు ఇంత సైలెంట్ కావడం సంచలనంగా మారింది.