ఏపీలో సీఎం జగన్ చేస్తున్న అప్పులు…వాటికోసం ఏపీ ఆర్థిక శాఖ పడుతున్న తిప్పలు గత కొంతకాలంగా తీవ్రస్థాయిలో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఏపీ ఆర్థిక శాఖ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, ప్రభుత్వ ఉద్యోగులకు నెలనెలా జీతాలిచ్చేందుకు కూడా తిప్పలు పడుతోందని చర్చ జరుగుతోంది. కార్పొరేషన్ల పేరుతో బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని ఖజానా లోటును భర్తీ చేయాలనుకున్న జగన్ కు బ్యాంకర్లు కూడా హ్యాండ్ ఇచ్చారని టాక్ వచ్చింది.
ఇక, వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రాష్ట్ర అభివృద్ధి సంస్థ (ఏపీఎస్డీసీ) ద్వారా రూ. 25 వేల కోట్ల రుణం తీసుకోవాలని భావించిన జగన్ ప్రభుత్వం దానికి సంబంధించిన ఒప్పంద పత్రంలో గవర్నర్ హరిచందన్ పేరు చేర్చడం వివాదాస్పదమైంది. ఈ విషయం తెలుసుకున్న గవర్నర్ ఫైర్ కావడం…ఆ తర్వాత ఆ వ్యవహారంపై గవర్నర్‌కు వివరణ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం, ఆర్థికశాఖల ఉన్నతాధికారులు రాజ్‌భవన్ చుట్టూ ప్రదక్షిణలు చేయడం తెలిసిందే. ఇక, ఈ తరహా రుణ ఒప్పందాల్లో గవర్నర్ పేరు చేర్చడాన్ని ఏపీ హైకోర్టు కూడా తప్పుబట్టింది.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారాన్ని రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ లేవనెత్తారు. గవర్నర్‌ను హామీగా పెట్టి ఏపీ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చే స్థాయికి దిగజారిపోయిందని నిండు సభలో జగన్ పరువు తీశారు.
జగన్ అనాలోచిత నిర్ణయాలు, ఆర్థిక విధానాలు, అవినీతి, పరిపాలన వైఫల్యం కారణంగా ప్రభుత్వం దివాలా దిశగా పయనిస్తోందన్నారు.
దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని రాష్ట్రపతి ప్రసంగంలో పేర్కొన్నారని, కానీ ఏపీలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతోందని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఏపీ ప్రభుత్వం గత రెండున్నరేళ్లలో ఏకంగా 3.5 లక్షల కోట్ల అప్పు చేసిందని, ఇప్పటికీ ప్రతి రోజూ అప్పుల కోసం పాకులాడుతోందని అన్నారు. మద్యనిషేధం హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్…మద్యంపై రాబోయే 25 ఏళ్లలో వచ్చే ఆదాయాన్ని హామీగా చూపించి అప్పులు చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.