ఏపీలో పీఆర్సీ వ్యవహారం కాక రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ నెల 7 నుంచి నిరవధిక సమ్మెకు ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు సిద్ధమవుతున్నాయి. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు తీసుకోబోమని ఉద్యోగులు తేల్చి చెబుతున్నారు. జీతాలు ప్రాసెస్ చేయబోమని ట్రెజరీ ఉద్యోగుల్లో చాలామంది పట్టుబట్టారు. ఈ క్రమంలోనే నేడు ఉద్యోగ సంఘాలకు సాధారణ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ లేఖ పంపారు. పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీలోని 20 మంది సభ్యులకు చర్చలకు ఆహ్వానం పలికారు. సచివాలయంలో మంత్రుల కమిటీతో సమావేశం ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఉపాధ్యాయులపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి.
కొద్ది రోజులుగా ఉద్యోగులకు, ప్రభుత్వ పెద్దలకు మధ్య పీఆర్సీ విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఉద్యోగులను, ఉపాధ్యాయులను బెదిరించేలా, ఉద్యోగ సంఘాలను వర్గాలవారీగా విభజించేలా ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారని విమర్శలు వచ్చాయి. దీంతో, జగన్ ను ఉపాధ్యాయులు నోటికొచ్చినట్టు మాట్లాడడం తగదని, లక్షల జీతాలు తీసుకుంటున్న ఉపాధ్యాయులు తమ పిల్లలను మాత్రం ప్రైవేటు స్కూళ్లలో చదివిస్తున్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి షాకింగ్ కామెంట్లు చేయడం దుమారం రేపింది. దీంతో, నారాయణ స్వామి వ్యాఖ్యలపై ఉపాధ్యాయులు ఫైర్ అయ్యారు.
ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లల్లో సగం మంది ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతున్నారని ఏపీ ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఫ్యాప్టో చైర్మన్ సుధీర్ బాబు అన్నారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి పిల్లలు, మనవళ్లు ఎక్కడ చదివారు? అంటూ ఆయన నిలదీశారు. పీఆర్సీ సమస్యను పరిష్కరించలేక మంత్రులు డ్రామాలాడుతున్నారని సుధీర్ బాబు మండిపడ్డారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి బాధ్యతగా మెలగాలని హితవు పలికారు. పీఆర్సీ గురించి కాకుండా నారాయణస్వామి మరో అంశం గురించి మాట్లాడడం సరికాదని ఫ్యాప్టో ప్రతినిధి హృదయరాజ్ అన్నారు. కార్పొరేట్ స్కూళ్లు లేని వ్యవస్థను ఈ ప్రభుత్వం తీసుకురాగలదా? అని నిలదీశారు. మరి, ఈ వ్యాఖ్యలపై నారాయణ స్వామి స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.