తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తంగా తయారవుతోందా? రుణాలు తేవడంలో పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ బాటలో పయనిస్తోందా? తాజా పరిస్థితి చూస్తే అవుననే అనిపిస్తోంది. ఆరు నెలల కింద బడ్జెట్లో రూ.6,743 కోట్ల రెవెన్యూ మిగులు చూపిన కేసీఆర్ ప్రభుత్వం.. ఇప్పుడు రూ.8,058 కోట్ల లోటు చూపుతోంది. దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదాయం ఇస్తోందని సీఎం కేసీఆర్ ఘనంగా చెప్పుకొన్నారు. ధనిక రాష్ట్రాల సరసన చోటు సంపాదించామన్నారు.
రెండేళ్లు తిరిగేసరికి అగ్ర స్థానానికి వెళ్తామన్నారు. తీరా చూస్తే.. ఆర్థిక పరిస్థితి అంతా డొల్లగా కనిపిస్తోంది. ఇవి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గానీ, పీసీసీ అధ్యక్షుడు రేవంతరెడ్డి గానీ చెబుతున్న మాటలో.. చేస్తున్న విమర్శలో కాదు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కంపో్ట్రలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఈ వాస్తవాలను బహిర్గతం చేసింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.6743.49 కోట్లు రెవెన్యూ మిగులు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ అంచనాల్లో పేర్కొంది. అయితే, తొలి ఆరు నెలల్లోనే రూ.8058.47 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడింది. బడ్జెట్ అంచనాల కంటే ఇది 119.5 శాతం ఎక్కువని కాగ్ స్పష్టం చేసింది. అలాగే అప్పులు కూడా జోరుగా తీసుకొస్తున్నారని తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తంలో రూ.45,509 కోట్ల వరకు అప్పులు చేస్తామని బడ్జెట్లో పేర్కొన్న సర్కారు.. తొలి ఆరు నెలల్లోనే రూ.25,573.72 కోట్లు తీసుకుంది. అంటే 56.19 శాతం అన్న మాట.
తగ్గిన రెవెన్యూ ఆదాయం..
ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఖజానాకు కేవలం 30.15 శాతం ఆదాయమే సమకూరింది. మొత్తం రెవెన్యూ ఆదాయం రూ.1,76,126.93 కోట్లు ఉంటుందని బడ్జెట్ ప్రతిపాదనల్లో పేర్కొనగా.. సెప్టెంబరు నాటికి రూ.53,109.63 కోట్ల ఆదాయం వచ్చింది.
అందులో పన్నుల రూపంలో రూ.45,859.85 కోట్లు, పన్నేతర రెవెన్యూ రూపంలో రూ.2,436.03 కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో రూ.4,813.75 కోట్లు వచ్చాయి. తొలి ఆరు నెలల్లో రూ.61,168 కోట్లు ఖర్చు చేశారు. రెవెన్యూ వ్యయం (రెవెన్యూ ఎక్స్పెండిచర్) కింద రూ.26,926.49 కోట్లు, వడ్డీల చెల్లింపునకు రూ.8,801.55 కోట్లు, వేతనాలు రూ.13,921.48 కోట్లు, పెన్షన్లు రూ.6,453.99 కోట్లు, సబ్సిడీ కింద రూ.5,064.59 కోట్లు ఖర్చు చేసినట్లు కాగ్ వివరించింది.
సెప్టెంబరు నెలాఖరు వరకు రూ.15,077.59 కోట్లు మూలధన వ్యయం (51.91 శాతం). రంగాల వారీగా ఖర్చును పరిశీలిస్తే సామాజిక రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ఖర్చు చేయడం గమనార్హం. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమానికి ఎక్కువ ఖర్చుచేస్తున్నామని చెప్పుకొనే సర్కారు.. సామాజిక రంగంలో తొలి ఆరు నెలల్లో రూ.26,661 కోట్లు మాత్రమే వ్యయం చేయడం గమనార్హం. అయినా భారీగా రెవెన్యూ లోటు ఏర్పడడం ఆందోళనకరంగా ఉందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
కాగ్ బయటపెట్టిన వివరాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి కేసీఆర్ ప్రభుత్వం కేర్ రేటింగ్స్ నివేదికను ముందుకు తెచ్చింది. మూలధన వ్యయంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని ఆ నివేదిక వెల్లడించింది. కేంద్రం ప్రస్తుత బడ్జెట్లో రూ.5.13 లక్షల కోట్లను మూలధన వ్యయంగా పేర్కొనగా.. తొలి ఆరు నెలల్లో కేవలం రూ.2.09 లక్షల కోట్లే ఖర్చు చేసిందని, ఇది 41 శాతమేనని తెలిపింది.
చిన్న రాష్ట్రమైన తెలంగాణ మాత్రం 51.91 శాతం మూలధన వ్యయంతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని వివరించింది. పెద్ద రాష్ట్రాలైన యూపీ, మహారాష్ట్ర అతి తక్కువగా ఖర్చు చేశాయని పేర్కొనడం గమనార్హం.