త్వరలో జరగబోతోన్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ నుంచి బీజేపీకి గట్టిపోటీ ఎదురుకానున్న నేపథ్యంలో బీజేపీ నేతలు పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. అయితే, ఇప్పటికే యూపీలోని యోగి సర్కార్ పై జనంలో వ్యతిరేకత ఉందన్న టాక్ వచ్చింది. ఈ క్రమంలోనే యూపీలో బీజేపీ కీలక నేతలు పర్యటించి..ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు చూస్తున్నారు. ఈ క్రమంలోనే యూపీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తన సొంత నియోజకవర్గంలో పర్యటించిన కేంద్ర మంత్రి స్మృతి జుబిన్ ఇరానీకి నిరనస సెగ తగిలింది.
స్మృతి ఇరానీకి తన ఇలాకాలో తీవ్ర నిరసన వ్యక్తమయింది. ఎన్నికల నేపథ్యంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న స్మృతి ఇరానీ కాన్వాయ్ ను స్థానిక ప్రజలు, విపక్ష పార్టీల కార్యకర్తలు అడ్డుకున్నారు. స్మృతి ఇరానీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తే ఆమె కారుపై దాడి చేసేందుకు యత్నించారు. ఆమె కాన్వాయ్ ను నిరసనకారులు కాసేపటివరకు ముందుకు కదలనివ్వలేదు. పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను చెదరగొట్టిన తర్వాత ఆమె అక్కడ నుంచి అతి కష్టం మీద వెళ్లారు. అయితే, ఈ వీడియోను, వార్తను ప్రసారం చేసేందుకు చాలా మీడియా సంస్థలు ముందుకు రాకపోవడంతో ఇది వెలుగులోకి రాలేదని తెలుస్తోంది.
దీంతో, ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. కేంద్రంలో, యూపీలో బీజేపీ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందనడానికి ఈ ఘటన నిదర్శనమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సొంత నియోజకవర్గానికి ఇరానీ చేసిందేమీ లేదని, అందుకే ఆగ్రహంతో ఉన్న ప్రజలు ఆమెను అడ్డుకున్నారని అంటున్నారు. యూపీ ఎన్నికలతో పాటు మిగతా నాలుగు రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల్లో బీజేపీకి పరాభవం తప్పదని కామెంట్లు పెడుతున్నారు. మెజారిటీ మీడియా సంస్థలను మోడీ సర్కార్ గుప్పెట్లో పెట్టుకుందని, అందుకే ఇటువంటి వీడియోలు బయటకు రావడం లేదని అంటున్నారు.