గుడివాడలో గోవా వ్యవహారం ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. మంత్రి కొడాలి నానికి చెందిన ఎన్ కన్వెన్షన్ లో కోడి పందేలు, జూదం, క్యాసినో, మహిళలతో అసభ్యకర డ్యాన్సులు గట్రా చేయించారని తీవ్ర ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకవంటి సంక్రాంతి పండుగ సంబరాల్లో అసభ్యకర డ్యాన్సుల వంటి పాశ్చాత్య విష సంస్కృతిని తీసుకురావడంపై టీడీపీ నేతలు, బీజేపీ నేతలు మండిపడుతున్నారు. దీనికితోడు ఏపీలో మహిళలపై అకృత్యాలు నానాటికీ పెరిగిపోతున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా నేడు టీడీపీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఆధ్వర్యంలో టీడీపీ నారీ సంకల్ప దీక్ష ప్రారంభమైంది. రాష్ట్రంలో మహిళలపై జరుగుతోన్న అఘాయిత్యాలతో పాటు మద్యపాన నిషేధంపై జగన్ ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడం వంటి, గుడివాడలో క్యాసినో, అమ్మాయిలతో అసభ్యకర నృత్యాలు వంటి అంశాలపై నిరసన తెలుపుతూ దీక్ష చేపట్టారు. జగన్ హయాంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా తెలుగు మహిళ రాష్ట్ర కమిటీ సభ్యులు ఈ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ పాలనపై వంగలపూడి అనిత మండిపడ్డారు.
అమ్మాయిలతో క్యాసినో నిర్వహించిన ఏపీ మంత్రులు మనుషులా? కాలకేయులా? అని అనిత షాకింగ్ కామెంట్లు చేశారు. వైసీపీ పాలనలో ఏపీలో మహిళలపై దాడులు పెరిగిపోయాయని, ఆ అఘాయిత్యాలకు వ్యతిరేకంగా తాము ఈ రోజు నిరసన దీక్ష చేపట్టామని చెప్పారు. ఈ దీక్షతో రాష్ట్ర మహిళల్లో ధైర్యం నింపుతామని అన్నారు. రాష్ట్రాన్ని జగన్ అప్పుల ఊబిలోకి నెట్టారని, ఆఖరికి పొదుపు సంఘాల డబ్బులు కూడా ప్రభుత్వం వాడుకుంటోందని ఆరోపించారు. జగన్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైందని, రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.