ఏపీలో పీఆర్సీ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటు ప్రభుత్వ ఉద్యోగులు, అటు ప్రభుత్వ పెద్దలు ఇద్దరూ పట్టు, బెట్టు వీడకపోవడంతో వివాదం ముదిరి పాకానపడింది. ఈ క్రమంలోనే కొత్త పీఆర్సీ ప్రకారం ఒకటో తారీకున జీతాలివ్వాల్సిందిగా ట్రెజరీ ఉద్యోగులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే, ట్రెజరీ ఉద్యోగులు పెన్షన్లు ప్రాసెస్ చేసి జీతాలు మాత్రం ప్రాసెస్ చేయలేదు. దీంతో, జీతాలు ప్రాసెస్ చేయకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని ట్రెజరీ ఉద్యోగులను ప్రభుత్వం హెచ్చరించింది. అయినప్పటికీ తగ్గేదేలే అని ట్రెజరీ ఉద్యోగులు మాత్రం పట్టినపట్టు వీడడం లేదు.
జగన్ సర్కార్ ఆదేశించినా మెజార్టీ ఆఫీసుల్లో ట్రెజరీ సిబ్బంది హాజరుకాకపోగా… కొన్ని ప్రాంతాల్లో సబ్ ట్రెజరీ కార్యాలయాలు తెరుచుకోలేదు. ఇక, జిల్లా కేంద్రాల్లోని ట్రెజరీ కార్యాలయాల్లో 50 శాతం సిబ్బంది హాజరయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యాలయాలకు హాజరు కాబోమని ట్రెజరీ సిబ్బంది స్పష్టం చేస్తున్నారు. కొన్ని కార్యాలయాలకు తాళాలు కూడా తీయలేదు. పోలీస్ శాఖ, కోర్టు సిబ్బంది వేతన బిల్లులను మాత్రమే ప్రస్తుతం ప్రొసెస్ చేస్తున్నారు. సిబ్బంది లేకపోవడంతో…..జిల్లా ట్రెజరీ ఆఫీసులకు పోలీసు కార్యాలయం నుంచి వచ్చిన సాంకేతిక సిబ్బందితో బిల్లులు ప్రొసెస్ చేయిస్తున్నారు.
అంతకుముందు, కొత్త పీఆర్సీ అమలు చేయని ట్రెజరీ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ హెచ్చరించారు. అంతేకాదు, ఇందుకు సంబంధించి ఉద్యోగులకు ఒక మెమో జారీ చేశారు. డెడ్లైన్ లోపు తమ ఆదేశాలు పాటించకుంటే చర్యలు తప్పవని, అటువంటి ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని డీటీఏ, పీఏవో, జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అయితే,గత నాలుగు రోజుల నుంచి ఇలా మెమోలు జారీచేస్తున్నా మెజారిటీ ట్రెజరీ సిబ్బంది ఖాతరు చేయడం లేదు. దీంతో, శనివారం నాటికి కనీసం 30శాతం వేతనాల బిల్లులు కూడా ప్రాసెస్ కాలేదు. మరి, ఈ వ్యవహారంలో జగన్ తదుపరి నిర్ణయం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.