ఏపీలో కొత్త జిల్లాల విభజన వ్యవహారం పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. కొన్ని జిల్లాల విభజన వల్ల తమ ప్రాంతానికి ఉన్న గుర్తింపు, పేరు పోతున్నాయని పలువురు ఆందోళన చెందుతున్నారు. ఇక, విభజన ప్రకారం పక్క జిల్లాలోకి వెళ్లడం వల్ల తమ స్థానికతకు భంగం కలుగుతుందని మరికొందరు అంటున్నారు. జిల్లాల పేర్లపై మరికొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గుడివాడలో పుట్టిన ఏఎన్నార్…తెలుగు చలన చిత్ర పరిశ్రమను మద్రాసు నుంచి హైదరాబాద్ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారని, అందుకే మచిలీపట్నం జిల్లాకు ఏఎన్నార్ పేరు పెట్టాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఇలా జిల్లాల విభజన వ్యవహారంతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి. ఈక్రమంలోనే అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో కూడా పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లా ఏర్పాటును హిందూపురం నియోజకవర్గ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హిందూపురం కేంద్రంగా జిల్లాను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కనబడుట లేదంటూ పోలీసులకు వారు ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. బాలయ్యతోపాటు ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ కనబడడం లేదంటూ స్థానిక బీజేపీ నాయకులు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు పట్టించుకోవడం లేదని ప్రజలు అంటున్నారు. జనం గోడుపై వీరిలో ఏ ఒక్కరూ స్పందించడం లేదని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ వెంటనే తమ పదవులకు రాజీనామా చేసి హిందూపురం కోసం జరుగుతున్న ప్రజా ఉద్యమంలో పాల్గొనాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరి, ఈ విషయంపై బాలయ్య తదితరులు ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.