ఏపీ అధికార పార్టీ నేతలు చెప్పిందే వేదం అని భావించి పాటిస్తున్న అధికారులు ఏపీ పరువును గంగలో కలుపుతున్నారు. గ్రూప్ 1 ఆఫీసరు, ఐఏఎస్ హోదా కలిగిన వ్యక్తి ఎవరో నాయకులు చెప్పారు… లోన్లు ఇవ్వని బ్యాంకుల ముందు చెత్త పోయడం ఏంటి? చివరకు కేంద్ర ఆర్థిక మంత్రి బహిరంగంగా చీవాట్లు పెడితే ఆ కమిషనర్ పదవి గంటలో పోయింది. జీవితాంతం అతనిపై రిమార్క్ పడింది. అంత చదువుకుని ఎవరో చెప్పారని, ఎవరి మెప్పుకోసమో పనిచేసేటపుడు చూసుకోవాలి కదా. వారి మాట వింటే మీ కెరియర్లు పాడవుతాయి, జైలుకు పోతారు అని చంద్రబాబు తరచు అంటుంటే జనానికి అర్థం కాలేదు.
కానీ మొన్న నంద్యాల కేసులో సస్పెండ్ అయిన పోలీసులు, శ్రీకాకుళంలో దళితుడిని తన్ని సస్పెండ్ అయిన పోలీసులు, రాజమండ్రిలో శిరోముండనం చేసి అభాసుపాలై కెరీర్ నాశనం చేసుకున్న పోలీసులు ఇలా చాలామందిని చూస్తూ ఉన్నాం. తాజాగా ఒక కమిషనర్ ఇలా బలైపోవడం ఆశ్చర్యకరం. విస్మయం. వైసీపీ అభిమానులు నోటి మీద వేలేసుకునేలా వీళ్లు వ్యవహరించారంటే ఎలాంటి నేతలు వైసీపీ లో రాజ్యమేలుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
బ్యాంకులు గవర్నమెంటు ఆఫీసులు కాదు. అవి వాణిజ్య బ్యాంకులు. అంటే వ్యాపార సంస్థల కింద లెక్క. తమకు లాభం వచ్చే పనే చేస్తాయి బ్యాంకులు. వారికి నచ్చకపోతే చేయకపోవచ్చు. జనం దాచుకున్న డబ్బులు కట్టలేని వారికి పంచిపెట్టి దివాలా తీస్తే చివరకు అన్యాయం అయ్యేది జనమే. వారి బాధ్యత వారు నిర్వర్తించినందుకు తాము చెప్పిన వారికి లోను ఇవ్వలేదని చెత్త తీసుకువచ్చి బ్యాంకు ముందు పోయడం ఏంటో…. అసలు ఆ రుణాలకు కమిషనర్ కు ఏం సంబంధమో అర్థం కాని విచిత్రమైన పరిస్థితి.
ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లాలో పలు చోట్ల బ్యాంకుల ముందు చెత్త వేసిన అంశం దేశవ్యాప్తంగా సంచలనం రేపడంతో కేంద్ర ఆర్థిక శాఖ తలదించుకుంది. బ్యాంక్ ఉద్యోగ సంఘాలు దీనిపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో తప్పు కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. నిజానికి దీనికి కారణం అయిన వైసీపీ నేతలను శిక్షించకుండా వారి మాట విన్న అధికారులను శిక్షిస్తున్నారు. ఈ కేసు విచారణ బాధ్యతలను గుంటూరు రీజనల్ డైరెక్టర్ శ్రీనివాసరావు, అడిషనల్ డైరెక్టర్లు జి.శేఖర్, డి.వెంకట్రామయ్యకు అప్పగించింది.
రంగంలోకి దిగిన అదికారులు ఉయ్యూరులోని పారిశుద్ధ్య కార్మికులను, బ్యాంక్ అధికారులను విచారించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. రుణాలివ్వనందుకు నిరసనగా బ్యాంకుల ఎదుట చెత్త వేసి అసౌకర్యాన్ని కలిగింటినట్లు నిర్ధారించారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురాకుండా ఇలా వ్యవహరించడాన్ని తీవ్రంగా పరిగణించి కమిషనర్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్ గా.. గుడివాడ మున్సిపల్ కమిషనర్ రంగారావుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇదేం పాలనో… జనానికే తెలియాలి.