మహేశ్ బ్యాంక్ (ఆంధ్రప్రదేశ్ మహేశ్ కో- ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్) ఖాతాలోకి చొరబడి రూ.12.93 కోట్లు తరలించిన సైబర్ నేరం పోలీసులకు ప్రశ్నల మీద ప్రశ్నలు ఎదురయ్యేలా చేస్తోంది. సాంకేతిక మాయాజాలంతో హ్యాకర్లు తెలివిగా వ్యవహరించిన ఈ నయా మోసాన్ని తేల్చటం హైదరాబాద్ పోలీసులకు ఇప్పుడు పెను సవాలుగా మారినట్లు చెబుతున్నారు.
ఈ మోసం లెక్క తేల్చేందుకు సైబర్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. బ్యాంక్ సర్వర్ ను హ్యాక్ చేసింది సైబర్ నేరగాళ్లుగా భావిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అసలు బ్యాంక్ సర్వర్ ను ఎలా హ్యాక్ చేశారు? అదెలా సాధ్యమైంది? అసలు సర్వర్ యాక్సెస్ ఎలా సాధ్యమైంది? లాంటి సాంకేతిక అంశాల్ని తేల్చటం ద్వారా.. ఈ నేరం ఎలా జరిగిందన్న విషయంపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు.
సైబర్ పోలీసులు అంచనా ప్రకారం బ్యాంకుకు మాల్ వేర్ పంపటం ద్వారా సర్వర్ యాక్సెస్ కోసం ప్రయత్నించారా? అన్న సందేహం వ్యక్తమవుతోంది. ఈ ఉదంతంలో తమకున్న సందేహాల్ని తీర్చేందుకు వీలుగా తాజాగా బంజారాహిల్స్ లోని సంస్థకు చెందిన సర్వర్ ఆఫీసుకు వెళ్లారు. సాంకేతిక అంశాల్ని ఆరా తీశారు. ముంబయి నుంచి వచ్చిన ప్రత్యేక టీం పోలీసులకు సహకారం అందిస్తోంది.
హ్యాకింగ్ చేసేందుకు సైబర్ నేరగాళ్లు ప్రాక్సీ ఐపీ అడ్రస్ లను వాడగా.. వాటిలో కొన్ని గాంధీ నగర్ ప్రాంతానికి చెందిన ఒక ఇంటర్నెట్ సెంటర్ కు చెందినవిగా గుర్తించారు. దీంతో సదరు ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు.. తాను ఫ్రీ వైఫై సేవల్ని అందిస్తుంటానని.. 24 గంటలు ఆన్ చేసి ఉంచుతానని చెప్పినట్లుగా చెప్పటంతో.. ఈ వైఫైను ఎవరు వాడుకొని ఈ పని చేశారా? అన్న విషయాన్ని గుర్తించే పని మొదలు పెట్టారు.
బ్యాంకుకు చెందిన బషీర్ బాగ్ బ్రాంచ్ లో ఈ నెల 11న సేవింగ్ ఖాతాను తెరిచిన షానాజ్ బేగం కీలక నిందితురాలిగా ఉండటం తెలిసిందే. నిందితురాలి బ్యాంకు ఖాతాలోని బెనిఫిషియర్ గా ఎంట్రీ ఇచ్చిన వారే ఇదంతా చేస్తున్నట్లుగా భావిస్తున్నారు.
ఇందులో భాగంగా నిందితురాలికి బ్యాంకు అధికారులు ఫోన్ చేయటం.. అప్పటి నుంచి ఆమె ఫోన్ స్విచాఫ్ లో ఉండటం ఒక ఎత్తు అయితే.. ఆమె కనిపించకుండా అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. ఆమె ఎక్కువగా ఫూణె – హైదరాబాద్ మధ్య పలుమార్లు రాకపోకలు సాగించినట్లుగా గుర్తించారు.
మరోవైపు రూ.12.93 కోట్ల బదిలీ అయిన 129 ఖాతాలకు సంబంధించిన వివరాల్ని సేకరిస్తున్న అధికారులకు.. అసలీ నేరం ఎలా చేశారన్న ప్రాథమిక ప్రశ్నపై మాత్రం ఇప్పటికి సందేహాలు తీరలేదు.
ఈ కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని.. ఇప్పటివరకు రూ.3 కోట్లు ఫ్రీజ్ చేశామని.. హ్యాకింగ్ ఎక్కడ నుంచి జరిగింది? ఎలా జరిగింది? ఖాతాలు తెరిచిన వారెవరు? వారి వివరాలు ఏమిటి? లాంటి అంశాలపై ఫోకస్ చేశామని.. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాల్ని వెల్లడిస్తామని హైదరాబాద్ సీపీ ఆనంద్ చెబుతున్నారు. మొత్తంగా ఈ నేరం ఒక మిస్టరీగా మారిందన్న మాట పోలీసు వర్గాల్లో వినిపిస్తోంది.