సీఎం జగన్ పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ రాజ్యాంగం చదువుకోవాలని, జగన్ రాజ్యాంగాన్ని గౌరవిస్తే రెండు వందల కేసులను ఓడిపోయేవాళ్లం కాదని షాకింగ్ కామెంట్లు చేశారు. రాజ్యాంగం ఫాలో కావాలలని చెప్పినందుకే తనను కొట్టారని రఘురామ అన్నారు. ఒక ఎంపీ తన నియోజకవర్గంలో తిరిగే హక్కు కూడా ఏపీలో లేదని, వైసీపీ పాలన అలా ఉందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి పూట జీవోలు అమలు చేయడంపై రఘురామ మండిపడ్డారు. హడావిడిగా అర్ధరాత్రి పూట జిల్లాల విభజన జీవొ ఇచ్చారని విమర్శించారు.
పార్లమెంట్ నియోజకవర్గాల ప్రాతిపదికన జిల్లాల ఏర్పాటని అంటున్నారని, హుటాహుటిన అర్ధరాత్రి జిల్లాల ఏర్పాటు ప్రకటన చేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. కేబినెట్లో జిల్లాల విభజన, పెంపుపై చర్చ జరగలేదని, అంత అర్జెంటుగా జీవో తీసుకురావాల్సిన అవసరమేంటని నిలదీశారు. ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టకుండా జిల్లాల విభజన చేయాలని రఘురామ సూచించారు. మరోవైపు, టీడీపీ నేత అశోక్‌బాబుపై అక్రమ కేసులు పెట్టారని రఘురామ విమర్శించారు. అశోక్‌బాబు చదివిన చదువు ఉద్యోగానికి సరిపోతుందని, కానీ, ఐదో తరగతి చదువుకున్న వారికి మంత్రి పదవులు, సలహాదారుల పదవులు ఇచ్చారని ఎద్దేవా చేశారు.
ఇక, ఏపీలో హడావిడిగా 26 జిల్లాల ప్రతిపాదన తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే. జిల్లాల విభజనపై కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయినప్పటికీ, జగన్ సర్కార్ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. 2024 ఎన్నికలలోపు జిల్లాల విభజన పూర్తయ్యే అవకాశం లేకపోయినా..హడావిడిగా రాజకీయ లబ్ధి కోసం ఈ ప్రతిపాదన తెచ్చారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక, జిల్లాల విభజనకు కేంద్రం విముఖంగా ఉన్నప్పటికీ జగన్ తగ్గేదేలే అంటూ విభజన చేసేందుకు మొగ్గు చూపడంపై బీజేపీ పెద్దలు కూడా గుర్రుగా ఉన్నారట.