మాదకద్రవ్యాల వినియోగంలో దోషులుగా తేలిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదు..డ్రగ్స్ కట్టడికి వెయ్యిమందితో ప్రత్యేకంగా బృందాన్ని ఏర్పాటు చేస్తున్నామంటు కేసీయార్ ప్రకటించారు. రాష్ట్రంలో డ్రగ్స్ అన్న పేరే వినిపించకూడదని చాలా గట్టిగా చెప్పారు. అయితే కేసీయార్ చెప్పేదంతా ఉత్తుత్తి బెదిరింపులే అని అర్ధమైపోతోంది. ఎందుకంటే తెలంగాణలో డ్రగ్స్ అనే మాటే వినిపించకుండా చేయడం కేసీయార్ కాదు కదా ఎవరి వల్ల కాదు.
ఎందుకంటే దేశవ్యాప్తంగా డ్రగ్స్ వాడకం విచ్చలవిడిగా పెరిగిపోతోంది. పైగా హైదరాబాద్ లోని కొన్ని వందల విద్యాసంస్థల్లో డ్రగ్స్ విపరీతంగా వాడుతున్నట్లు ఎప్పటినుండో ఆరోపణలున్నాయి. డ్రగ్స్ వాడుతున్న వాళ్ళల్లో అత్యంత ప్రముఖుల పిల్లలే ఎక్కువగా ఉన్నారు. వీళ్ళు కాకుండా డ్రగ్స్ వాడుతున్న సినీ సెలబ్రిటీలకు కొదవేలేదు. వీళ్ళలో ఒక్కరిపైన కూడా కేసు నమోదు చేసి కోర్టులో నిలబెట్టిన ఘటన ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు.
ఆ మధ్య సినీ సెలబ్రిటీలను చాలామందిని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు రోజుల తరబడి పిలిపించి విచారణ జరిపించారు. తమ విచారణలో ఎవరెవరికి డ్రగ్స్ తో సంబంధాలున్నాయి, వాడుతున్నదెవరు ? పెడలర్లుగా పనిచేస్తున్నదెవరు ? అనే విషయాలను ఉన్నతాధికారులు దాదాపు తమ విచారణలో రాబట్టినట్లు ప్రచారం జరిగింది. అయితే చివరకు ఏమైంది ? సెలబ్రిటీలంతా బాధితులే అని సింపుల్ గా కేసీయారే మీడియా సమావేశంలో తేల్చేశారు.
డ్రగ్స్ వ్యవహారంలో విచారణను ఎదుర్కొన్న వారంతా బాధితులే అని స్వయంగా కేసీయారే తేల్చేసిన తర్వాత ఇక ఉన్నతాధికారులు ఎంత విచారణ చేసినా మాత్రం ఉపయోగం ఏముంటుంది ? అందుకనే అందరినీ వదిలిపెట్టేశారు. పొరుగునే ఉన్న మహారాష్ట్ర, కర్నాటకలో డ్రగ్స్ తో సంబంధాలున్న సెలబ్రిటీలను, వాళ్ళ సంతానాన్ని, వ్యాపారస్తులను అందరినీ అరెస్టులు చేసి కోర్టులో ప్రవేశపెట్టి జైళ్ళకు పంపుతున్నారు. ఉన్నతాధికారులు అంత గట్టిగా ఉంటున్న ఆ రాష్ట్రాల్లోనే డ్రగ్స్ ను కంట్రోల్ చేయలేక ప్రభుత్వాలు తలలు పట్టుకుంటున్నాయి.
కాబట్టి డ్రగ్స్ విషయంలో తాజాగా కేసీయార్ చేసిన ప్రకటనను ఎవరు నమ్మటం లేదు, సీరియస్ గా తీసుకోవటమూ లేదు. వ్యాపారస్తులను, పెడలర్లను, సెలబ్రిటీలను, ప్రముఖుల వారసులపై కేసులు పెట్టి కోర్టులో ప్రవేశపెడితే అప్పుడు ప్రభుత్వం చిత్తశుద్దిని జనాలు మెచ్చుకుంటారు. అంతేకానీ మీడియా కోసం ఏదో ఒకటి చెప్పేయటం తర్వాత దానికి క్షేత్రస్థాయిలో విరుద్ధంగా జరుగుతున్నది చూస్తూ కూడా జనాలు ఎలా నమ్ముతారు ?