ఏపీలో పీఆర్సీ రచ్చ తారస్థాయికి చేరింది. తమ డిమాండ్లను పరిష్కరించకుంటే సమ్మెకు దిగుతామని ఉద్యోగులు, ఉపాధ్యాయులు హెచ్చరిస్తున్నా ప్రభుత్వం మాత్రం బెట్టువీడడం లేదు. ఎస్మా ప్రయోగించినా సమ్మె చేసి తీరతామని ఉద్యోగ సంఘాల నాయకులు వార్నింగ్ ఇచ్చినా…జగన్ లైట్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఇక చర్చలతో లాభం లేదనుకున్న ఉద్యోగ సంఘాల నేతలు సమ్మె సైరన్ మోగించారు.
పీఆర్సీ వ్యవహారంపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీసులిచ్చాయి. రాష్ట్ర జీఏడీ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్ కు ఉద్యోగ సంఘాల నేతలు అధికారికంగా సమ్మె నోటీసు ఇచ్చారు. ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తున్నట్టు నోటీసులో ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు. సవరించిన పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామని అన్నారు.
ఇక, ప్రభుత్వ ఉద్యోగుల సమ్మెకు ట్రెజరీ శాఖ ఉద్యోగులు కూడా మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. కొత్త పీఆర్సీ ప్రకారం సవరించిన వేతనాలకు ఫిబ్రవరి నెలకు చెల్లించాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా….తాము కూడా ఉద్యోగులమేనని, అలా చేయబోమని ట్రెజరీ ఉద్యోగులు చెప్పారు. వీరికి తోడుగా ప్రభుత్వ ఉద్యోగుల సమ్మెకు తమ మద్దతు ఉంటుందని ఆర్టీసీ ఎన్ఎంయూ రాష్ట్ర కార్యదర్శి సుజాత ప్రకటించారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పటికీ ఉద్యోగుల సమస్యలు తీరలేదని, ఆర్టీసీ ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. రవాణా వ్యవస్థను పూర్తిగా స్తంభింపజేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఎలా పోరాడాలో తేల్చుకోలేని అయోమయంలో ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పీఆర్సీ ఇస్తారని ఆర్టీసీ ఉద్యోగులంతా భావించారని, కానీ, వారితో పోలిస్తే ఆర్టీసీ ఉద్యోగులకు 19 శాతం ఐఆర్ తేడా ఉందని వాపోయారు. గతంలో నాలుగేళ్లకోసారి ఆర్టీసీలో వేతన సవరణ ఉండేదని, ఇప్పుడు మాత్రం పదేళ్లకోసారి అంటున్నారని మండిపడ్డారు.