గుడివాడలో గోవా రచ్చ ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. మంత్రి కొడాలి నానికి చెందిన ఎన్ కన్వెన్షన్ లో క్యాసినోతోపాటు అసభ్యకర నృత్యాలు, జూదం, కోడి పందేలు, పేకటా జరిగాయని టీడీపీ నేతలు సాక్షాధారాలతో సహా కన్విన్సింగ్ గా ప్రూవ్ చేస్తున్నారు. దీంతోపాటు, పెట్రోల్ బాటిళ్లు పట్టుకొని మరీ నానికి సవాల్ విసురుతున్నారు. దీంతో, నరం లేని నాలుక అడ్డదిడ్డంగా తిరుగుతుందన్న చందంగా…కొడాలి నాని కూడా తన వ్యాఖ్యలపై యూ టర్న్ లు తిరుగుతున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా కొడాలి నానిపై టీడీపీ అగ్రనేత వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడాలి నాని పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, పక్కా ప్రణాళికతోనే గుడివాడలో కేసినో నడిపించారని ఆధారాలతో సహా బట్టబయలు చేస్తున్నా ఇంకా బుకాయిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ కేసినోలో 13మంది చీర్ గాళ్స్ కూడా ఉన్నారని, వారంతా ఇండిగో విమానం ద్వారా ప్రయాణించారని వెల్లడించారు. గన్నవరం-బెంగళూరు, బెంగళూరు-గోవా, గోవా-విజయవాడ ప్రయాణికుల వివరాలను మీడియా ముందు బట్టబయలు చేశారు.
గోవా నుంచి బెజవాడ వచ్చిన వారి వివరాలను పోలీసులు సేకరించాలని డిమాండ్ చేశారు. ఉత్తరాది రాష్ట్రాల మహిళలు గుడివాడ ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. సాక్ష్యాలున్నా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని నిలదీశారు. కేసినో ఎంట్రీ ఫీజు రూ.50 వేలు అని, లాడ్జిలో వసతి, ట్రాన్స్ పోర్టు, భోజనం అన్నీ ఉచితమని వర్ల రామయ్య ఆరోపించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఈ మంత్రిని జగన్ ఎలా సమర్థించుకుంటారని, మంత్రివర్గం నుంచి నానిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.