ఇళ్లపట్టాల రగడ మొదలైంది. పట్టాలు దక్కని వైసీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తూర్పు గోదావరి వేగివారిపాలెంలో ఇళ్లపట్టాల పంపిణిని వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇల్ల పట్టాలను అర్హులకు ఇవ్వవకుండా అర్హత లేని వారికి ఇస్తున్నారని, పార్టీ నేతలపై, అధికారులపై వైసీపీ కార్యకర్తలు తిరుగుబాటు. నిజమైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంలేదంటూ వైసీపీ కార్యకర్తల గొడవకు దిగారు. దీంతో వారికి సర్దిచెప్పడానికి అధికారులు, నేతలు తంటాలుపడ్డారు.
అర్హులకు ఇవ్వకపోగా… ఇప్పటికే ఇళ్లపట్టాలు ఉన్నవారికే మళ్ళీ ఇస్తున్నారని అధికార పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వెలిబుచ్చుతూ ధర్నాకు దిగారు. వారికి నచ్చజెప్పడానికి ప్రయత్నించినా వినలేదు. దీంత ఇళ్ల పట్టాల పంపిణిని అధికారులు మధ్యలోనే ఆపేశారు.
ఇదింకా ఆరంభమే. నిజానికి ఈ ఇళ్ల పట్టాల వ్యవహారం వైసీపీకి చాలా తలనొప్పులు తేనుంది. కచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇళ్లు ఇవ్వడం ప్రభుత్వ తరం కాదు. ఇల్లు దక్కని వారికి అసూయ పెరుగుతుంది. పార్టీలో పేదలే కాకుండా అన్నీ ఉన్నవాళ్లు కూడా ఇళ్ల పట్టాలు ఆశిస్తారు. దానిని ఆపాలని చూస్తే పార్టీ మీద కోపమొస్తుంది. ఈ సమస్య ప్రతిజిల్లాలోను వస్తుంది. కార్యకర్తలను సంతృప్తి చెందేలా చేయడం కత్తిమీద సామే. ఇళ్లు రాని వారు అసలు రాబోయే ఎన్నికల్లో ఓటేసే ప్రసక్తే ఉండదు. అది మానవ సహజం.
ఇక పోతే ఇళ్లు సరైన ప్రాంతంలో ఇవ్వలేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇళ్లు ఇవ్వడం ద్వారా పేదలకు అన్నిచోట్ల ప్రయోజనం కలగడం లేదు. అదే సమయంలో పార్టీకి కూడా అది ఓటుగా మారుతుందని గ్యారంటీగా చెప్పే పరిస్థితి కూడా లేదు. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇది అంతర్గత సమస్యలా మారి పార్టీని వేధించేే అవకాశం ఉంది.