రేవంత్ కే పట్టాభిషేకం... సీనియర్లలో ఆందోళన

జగ్గారెడ్డి ఈరోజు కాంగ్రెస్ అధిష్టానానికి ఒక ఫన్నీ సలహా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఏకపక్షంగా పీసీసీ ఛీఫ్ ను పెట్టడం మంచిది కాదు.... ‘‘సీనియర్ల ఏకాభిప్రాయం’’తో పార్టీకి పీసీసీ ఛీఫ్ ను ఎన్నుకోవాలని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి పార్టీని కోరారు. అసలే సీనియర్లు ప్రతి ఒక్కరు తమకే పీసీసీ ఛీఫ్ కావాలి అని పోటీ పడుతుంటే... ఏకాభిప్రాయం తీసుకోవాలి అన్న సలహానే నిష్ప్రయోజనం.

అయితే, జగ్గారెడ్డి గాని, వీహెచ్ గానీ... ఇంకా మరికొందరు గాని రేవంత్ కి పీసీసీ ఛీఫ్ ఇవ్వాలన్న ఆలోచననే జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ ఏమో అతని వైపే మొగ్గు చూపుతోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్ధానంలో కొత్త వ్యక్తి ఎవరు అన్న ఉత్కంఠకు తొందరలో తెరపడనుంది. అధ్యక్షపదవి మాదే అని సుమారు 10 మంది సీనియర్లు... పట్టుబట్టడంతో ఎంపిక జఠిలమైంది.అయితే కాంగ్రెస్ కి ఇది కొత్త సమస్యేం కాదు. ప్రతిసారి ఇలాంటి చర్చే జరుగుతు వస్తుంది.

పార్టీ అధిష్టానం తరపున మాణిక్యం ఠాగూర్ హైదరాబాద్ కు మీటింగ్ లు పెడుతున్నారు. వచ్చి నాలుగురోజులు కూర్చున్నారు. సుమారు 200 మంది అభిప్రాయాలు విడివిడిగా సేకరించి ఢిల్లీ వెళ్లారు. మరి సీల్డ్ కవర్లో ఏ పేరు వస్తుందో చూడాలి.

సీనియర్లు అంతా ఢిల్లీలో తిష్టవేశారు. ఎంత సేపు తాము ఎదగాలన్న కోరికే గాని వీరిలో పార్టీ ఎదగాలని కోరుకునేవారు తక్కువ. అందుకే ప్రతిసారి ఇదే సందిగ్దత. చివరకు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి ఫైనలయ్యారు. ఈ ఇద్దరు పార్టీ పదవికి అర్హులే కాని.. రేవంత్ వల్ల కొంచెం ఉపయోగం ఎక్కువున్న నేపథ్యంలో పార్టీ  రేవంతును ప్రెసిడెంటుగా నియమించాలని అనుకుంటోందట.  రేవంత్ తో గట్టి పోటీదారు ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సీడబ్ల్యూసీలో శాశ్వత సభ్యునిగా నియమించాలనే ప్రతిపాదన పెట్టి... అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రకటన లాంచనమే. రేవంతే అధ్యక్షుడు అని బయట ప్రచారం జరుగుతోంది. ఎన్నటికీ పార్టీ మారే అవకాశం లేని వ్యక్తిగా అతన్ని అధిష్టానం గుర్తిస్తోంది. అంతేకాదు.. కేసీఆర్ ను ఎదుర్కోవడానికి రేవంత్ మాత్రమే సరైన వ్యక్తి అన్న ప్రచారం ఉంది. అతనుమంచి వక్త. యువకుడు. తెలంగాణలో కేసీఆర్ తర్వాత మంచి ఫాలోయింగ్ ఉన్న నేత.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.