దేశ రాజకీయాల్లో ఎంతో కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేడి క్రమంగా పెరుగుతోంది. ఏడు దశాల్లో జరిగే రాష్ట్ర ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ప్రధాన పార్టీలన్నీ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నానాలను ముమ్మరం చేశాయి. ఇప్పటి వరకూ సామాజిక వర్గాలపై దృష్టి పెట్టిన పార్టీలన్నీ ఇకపై మతాల వారీగానూ ప్రజల మద్దతు సంపాదించే దిశగా సాగుతున్నాయి. అందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి.
కులమతాల ప్రాతిపదికన ఓటర్లు చీలే అవకాశాలు ఎక్కువగా ఉన్న యూపీలో లౌకికవాద పార్టీలు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. రాష్ట్రంలోని హిందువులను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలతో పాటు రాష్ట్ర జనాభాలో 19 శాతంగా ఉన్న ముస్లిం ఓటర్లను కూడా చేజారిపోకుండా చూసుకునేందుకు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి.
బీజేపీ అదే అజెండా..
హిందుత్వ అజెండాతో ముందుకు సాగే బీజేపీ మరోసారి యూపీలో అదే పంథా అనుసరించనుంది. హిందువులకు ముఖ్యమైన అయోధ్య, మథుర, కాశీ వంటి నగరాలు ఆ రాష్ట్రంలో ఉన్నాయి. దీంతో అక్కడ ఎన్నికలు జరిగిన ప్రతిసారి రాజకీయాలు హిందుత్వం చుట్టూ తిరుగుతుంటాయి.
2017 ఎన్నికల్లో ఘన విజయం తర్వాత యోగి ఆదిత్యనాథ్‌ను బీజేపీ సీఎం చేసింది. ఆయన హిందువుల ప్రతినిధిగా ముందుకు సాగుతున్నారు. సీఎం అయిన తర్వాత ఆయన 36 సార్లు అయోధ్యను సందర్శించారు. కొందరు ముస్లింలు గోవధతో పాటు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ యోగి విమర్శలు చేస్తూనే ఉన్నారు.
పలు ప్రాంతాలకు ముస్లిం సంబంధిత పేర్లనూ తొలగించారు. తాజా ఎన్నికలను ఉద్దేశించి ఈ పోరు 80 శాతం మందికి, 20 శాతం మందికి మధ్య జరుగుతున్న పోరాటంగా యోగి అన్నారు. అంటే ఆయన ముస్లింలను ఉద్దేశించే 20 శాతం అనే పదాన్ని ఉపయోగించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
ఆ దారిలో కాంగ్రెస్..
యూపీలో అధికారంలోకి రావాలనే పట్టుదలతో శ్రమిస్తున్న కాంగ్రెస్ పార్టీ ముస్లింలు దూరం కావొద్దనే వ్యూహంతో ముందుకు సాగుతోంది. అందుకే ఆ పార్టీ అయోధ్య రామ మందిరం వ్యవహారం నుంచి కాస్త దూరంగా ఉన్నట్లు రాజకీయ నిపుణులు అంటున్నారు.
ముస్లింలు దూరం అవుతారన్న ఆందోళనల నేపథ్యంలోనే పార్టీ ఇలా చేస్తుందని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీని గెలిపించే బాధ్యతలు తీసుకున్న ప్రియాంక.. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు హనుమాన్ గఢీని సందర్శించుకున్నారు. మరోవైపు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి.. హిందువులను ఆకట్టుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది.
ఆయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని మాయావతి స్వాగతించారు. ఈ సారి ఎన్నికల ప్రచారాన్ని అక్కడి నుంచే మొదలెట్టారు. రాష్ట్రంలో దాదాపు 10 శాతంగా ఉన్న బ్రాహ్మణ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి బీఎస్పీ ప్రయత్నిస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
రెండు వర్గాల మద్దతు..
ప్రస్తుత ఎన్నికల్లో అధికార పార్టీ బీజేపీకి గట్టిపోటీనిచ్చేలా కనిపిస్తున్న అఖిలేష్ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఆ దిశగా దూసుకెళ్తోంది. అటు హిందువులతో పాటు ఇటు ముస్లింలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. ముస్లింలకు అనుకూలంగా ఉంటుందని పార్టీపై వచ్చిన పేరును తొలగించుకునేందుకు ఎస్పీ నేతలు ఇటీవల వరకు ఆలయాలకు వరుస కట్టారని తెలిసింది.
శ్రీరాముడు ఎస్సీకి చెందినవారే అని 2020లో వ్యాఖ్యానించిన అఖిలేష్ కూడా అప్పటి నుంచి పలు దేవాలయాలకు వెళ్లారు. ఇక ఇటీవల గాంధీతో కలిసి స్వాతంత్య్రం కోసం మహ్మద్ జిన్నా పోరాడారని పేర్కొన్న ఆయన ముస్లింలకు దగ్గరయేందుకు అలా అన్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక యూపీలో పట్టు కోసం ప్రయత్నిస్తున్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. ఇతర పార్టీల మాయలో పడొద్దని ముస్లింలకు పిలుపునిస్తున్నారు.