ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత నవ్యాంధ్ర ప్రజలందరి బ్రతుకుల్లో చీకటి నిండుకున్న సంగతి తెలిసిందే. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి కట్టుబట్టలతో ఏపీకి వచ్చిన తర్వాత….పరిస్థితి అంతా అగమ్య గోచరం. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నవ్యాంధ్ర ప్రజల పాలిట ఆశాకిరణంగా నిలిచారు నాటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. లోటు బడ్జెట్ తో ఉన్న నవ్యాంధ్ర ….నేడు ఇంత ఎత్తుకు ఎదిగిందంటే అది చంద్రబాబు చలవే.
కట్టుబట్టలతో నవ్యాంధ్రకు వచ్చిన చంద్రబాబు…ఎన్నో సవాళ్ళ మధ్య రాష్ట్రాన్ని ముందుకు నడిపించిన తీరు ఎందరికో ఆదర్శనీయం. కూర్చోవడానికి కుర్చీ లేదు, సమావేశాలకు వేదికలు లేవు…హోటళ్లలో సమావేశాలు, బస్సులో పడుకొని పరిపాలన సాగించిన కర్మయోగి చంద్రబాబు. రాజధాని లేదు, ఆర్ధిక వనరులు లేవు, కేంద్ర సాయంలేదు. ప్రతిపక్షాల అడ్డంకులు, ప్రకృతి ప్రకోపాలు తట్టుకొని మొక్కవోని ధైర్యంతో పోరాడి చీకట్లు నిండిన రాష్ట్రంలో తారాజువ్వలా వెలిగారు చంద్రబాబు. ఆ క్రమంలోనే ప్రపంచ స్థాయి రాజధాని అమరావతికి శ్రీకారం చుట్టారు.
కోట్లాది తెలుగు ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా వేగంగా ప్రజా రాజధాని నిర్మాణానికి నడుం బిగించారు.నిర్మాణం అంటే ఇసుక, ఇటుకలు,సిమెంట్ కాదని కోట్లాది ప్రజల ఆకాంక్షలకు ఆకారమని,కలలకు సాకారమని అమరావతి నిర్మాణం సాక్షిగా నిరూపించారు. చంద్రబాబు ఒక్క పిలుపుతో స్పందించిన రైతులు రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలు భూములు ఇవ్వడం నభూతో నభవిష్యత్.
దశాబ్ధాలుగా కాగితాలకే పరిమితమైన పోలవరం ప్రాజెక్టును 70శాతం పూర్తిచేశారు.నదులు అనుసంధానం అనే ఆదర్సాన్ని నిజం చేసి చూపిన ఒక వజ్ర సంకల్పుడు చంద్రబాబు.ఎత్తిపోతల పధకం ద్వారా నిర్మించిన ఆధునిక దేవాలయం వల్ల పట్టిసీమ పవిత్రమయింది. వరదలా వచ్చిన విదేశీ పెట్టుబడులు,లక్షల మందికి ఉపాధి కల్పన అన్ని ఉంటే పరిశ్రమలు రావడం పెద్ద విషయం కాదు. కానీ అన్ని కోల్పోయన రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు కల్పించి,పరిశ్రమలు ఆకర్షించి,ఉపాధి కల్పించి,అద్భుతాలు సృష్టించడం నవ్యాంధ్రలోనే సాధ్యమైంది.
అటువంటి అమరావతికి వచ్చిన మోడీ మన్ను,నీళ్లు మన మొఖాన కొట్టాడు. పక్కనే ఉంటున్నట్లు నటించిన పవన్ విష ప్రచార పుస్తకాలు, పర్యావరణ కేసులు వేయించాడు. ఇక, అమరావతిపై శాసన సభలో ఏకగ్రీవ తీర్మానానికి మద్దతు తెలిపి…గెలిచిన తర్వాత అమరావతిపైనే దుష్ప్రచారం చేశాడు జగన్. అడ్డగోలుగా మూడు రాజధానుల బిల్లు పెట్టి అమరావతిని అటకెక్కించారు. అమరావతి రైతుల ఉద్యమాన్ని కూడా చులకన చేసి నానా ఆటంకాలు సృష్టించాడు.
పర్యావరణ అనుమతుల కేసులలో విజయం సాధించిన చంద్రబాబుకు అప్పటికి మిగిలింది 16 నెలలే. కానీ, అప్పటికే శాసనసభ, సచివాలయం, హైకోర్టు, దేశంలో అతి పెద్ద ఇంజనీరింగ్ విశ్వవిద్యాలయాలు,పోలీసు కార్యాలయం,విద్యుత్ సౌధ,గన్నవరం విమానాశ్రయ అభివృద్ధి,రోడ్డు భవనాల భవంతి,కొండవీటి వాగు ప్రాజెక్ట్, హైదరాబాదు నుండి కార్యాలయాలు,ఉద్యోగుల తరలింపు వంటి కార్యక్రమాలను వాయువేగంతో పూర్తి చేశారు చంద్రబాబు.
అమరావతి బృహత్తర ప్రణాళిక, 30 కు పైగా ప్రధాన రోడ్లు,సచివాలయ ఉద్యోగులందరికీ భవనాలు, ఐఏఎస్,ఐపీఎస్ ఉద్యోగుల నివాసాలు పూర్తి చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అన్యాయం చేసిందని కేసు వేసిన రైతులు లేరు. ఉద్యోగుల జీత భత్యాలు ఆడిగినట్టు పెంచిన చంద్రబాబు…16 వేల కోట్ల వ్యవసాయ రుణం తీర్చారు. 25 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించి…10 లక్షల ఇళ్ళు పేదలకు నిర్మించి పూర్తి చేశారు.
5 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు,10 లక్షల పరోక్ష ఉద్యోగాలు, కాపులకు 1000 కోట్ల నిధులు,ఇతర బలహీన వర్గాలకు,డ్రాక్వా సంఘాలకు వేలకోట్ల నిధులు ఇచ్చారు చంద్రబాబు. ఆనాడు టీడీపీ అధినేతపై మోడీకి ఎంత వ్యతిరేకత ఉన్నా కేంద్ర,అంతర్జాతీయ పాలనా అవార్డులు అనేకం దక్కించుకున్నారు చంద్రబాబు. అటువంటి చంద్రబాబును కుట్రపూరితంగా అబద్ధపు హామీలిచ్చి ఓడించారు. ఇన్ని అవాంతరాలు ఎదుక్కొని ఐదేళ్లలో బాబు సాధించిన విజయాలను దేశంలో మరెవరైనా ఎప్పటికైనా సాధించగలరా? నూటికి నూరు శాతం అది చంద్రబాబుకే సాధ్యం అనడంలో ఎటువంటి సందేహం లేదు.