పొద్దున లేస్తే చాలు…టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ ల మీద విమర్శలు గుప్పించేందుకు వైసీపీ నేతలు సిద్ధంగా ఉంటారు. సందు దొరికిందంటే చాలు తమ వంకర బుద్ధిని ప్రదర్శిస్తుంటారు. చంద్రబాబు, లోకేశ్ లు హైదరాబాద్ లో ఉండి ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారంటూ కామెంట్లు చేస్తుంటారు. కానీ, ఇన్ని చెప్పిన వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం కరోనా సోకినపుడు చికిత్స కోసం పొరుగు రాష్ట్రాలలో ఉన్న హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఆసుపత్రులకు పోలోమని వెళ్లారు.
కానీ, వైసీపీ నేతల తీరుకు భిన్నంగా తాజాగా కరోనాబారిన పడిన చంద్రబాబు మాత్రం ఏపీలోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్న నేపథ్యంలో వైసీపీ నేతలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. గురివింద గింజ నలుపులాగా వైసీపీ నేతలకు తమలో ఉన్న లోపాలు కనిపించవని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ నేతలు ఇతరులకు చెబుతుంటారని, వారు మాత్రం పాటించరని ఎద్దేవా చేస్తున్నారు. వైసీపీ నేతలూ…చంద్రబాబు పక్కా లోకల్… మేడిన్ ఆంధ్రా…ఇదే ప్రూఫ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు.
కాగా, తనకు కరోనా సోకిన విషయాన్ని స్వయంగా చంద్రబాబు మంగళవారం ఉదయం ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. కరోనా టెస్టులో స్వల్ప లక్షణాలతో పాజిటివ్ వచ్చినట్లు చంద్రబాబు ట్వీట్ చేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నానని, కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందవద్దని వెల్లడించారు. ఇటీవల తనను కాంటాక్ట్ అయిన వారు టెస్ట్ చేయించుకోవాలని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మరోవైపు, చంద్రబాబు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని సీఎం జగన్ ట్వీట్ చేయడం విశేషం.