మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ గురించి తెలుగు ప్రజలకు పరిచయం అక్కర లేదు. ఆంధ్ర ఆక్టోపస్ గా పేరుగాంచిన లగడపాటి…ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్నమాట ప్రకారం రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. చాలాకాలంగా మీడియాకు కూడా లగడపాటి దూరంగా ఉంటూ ఎటువంటి రాజకీయ వ్యవహారాలపైనా స్పందించడం లేదు. దీంతో, లగడపాటి రాజకీయ సన్యాసం తీసుకున్నట్లేనని అంతా అనుకున్నారు.
అయితే, లగడపాటి తిరిగి రాజకీయాల్లోకి రాబోతున్నారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోన్నా…అది పుకారుగానే మిగిలిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా లగడపాటి పొలిటికల్ రీ ఎంట్రీపై ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. త్వరలోనే లగడపాటి టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోందట. 2024 ఎన్నికల్లో లగడపాటి పోటీ చేస్తారని, విజయవాడ లేదా గుంటూరు ఎంపీ టికెట్ లగడపాటికి దక్కనుందని టాక్ వస్తోంది.
ఇప్పటికే ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్ లకు రెండుసార్లు వరుసగా ఎంపీ టికెట్ ఇచ్చారని, కాబట్టి వారిద్దరికీ అసెంబ్లీ టికెట్ లు ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చాలాకాలంగా కేశినేని నాని…పార్టీకి అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో లగడపాటిని నాని స్థానంలో బరిలోకి దించాలని చంద్రబాబు యోచిస్తున్నారట.
అయితే, నాని మాత్రం ఎంపీగా హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలతో ఉన్నారట. దీంతో, నానిని గుంటూరు ఎంపీ స్థానంలో బరిలోకి దించి…గల్లా జయదేవ్ ను చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపే యోచనలో చంద్రబాబు ఉన్నారట. అయితే, ఇటు లగడపాటిగానీ…అటు టీడీపీ నేతలుగానీ ఈ వ్యవహారంపై ఎటువంటి ప్రకటన చేయలేదు.