తన హత్యకు కుట్ర జరుగుతోందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఉరఫ్ ఆర్ ఆర్ ఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఝార్ఖండ్ వ్యక్తులతో తనను చంపించేందుకు ప్రయత్నం జరుగుతోందన్నారు. ఐపీఎస్ అధికారి, సీఐడీ చీఫ్ పి.వి. సునీల్ కుమార్ నుంచి తనకు ప్రాణహాని ఉందని సంచలన విషయం వెల్లడించారు.
సీఎం జగన్‌తో కుమ్మక్కై తనకు ప్రాణహాని తలపెట్టారని ఆరోపించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి రఘురామ లేఖ రాశారు. ప్రస్తుతం ఈ విషయం సంచలనంగా మారింది.
“సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్ నుంచి తనకు ప్రాణహాని ఉంది. సీఎం జగన్‌తో కుమ్మక్కై తనకు ప్రాణహాని తలపెట్టారు. సునీల్‌కుమార్ ఆధ్వర్యంలోని సంస్థతో నాపై కేసులు పెట్టించారు. కేసుల విచారణకు పిలిచి నన్ను చంపాలని ప్రణాళిక రచించారు. గతేడాది మే 14న కస్టోడియల్ టార్చర్‌కు గురిచేశారు. గుంటూరు జైలులో చంపేందుకు కుట్ర పన్నారు. సీఎం నిర్ణయాలను విమర్శిస్తున్నాననే భౌతిక దాడికి యత్నిస్తున్నారు. నన్ను చంపే కుట్రలో సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఉన్నారు. ఈ కుట్రపై ఎన్ఐఏ వంటి సంస్థతో విచారణ జరిపించాలి“ అని రఘురామ తన లేఖలో పేర్కొన్నారు.
గతేడాది ఇచ్చిన ప్రివిలేజ్ ఫిర్యాదుపై చర్యలు తీసుకోలేదని ప్రధానికి రాసిన లేఖలో రఘురామ పేర్కొన్నారు. ప్రివిలేజ్ ఫిర్యాదుపై లోక్‌సభ స్పీకర్‌కూ లేఖ రాశానని రఘురామ స్పష్టం చేశారు. ఇదిలావుంటే, హైదరాబాద్‌లో ఈ నెల 12న ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులిచ్చారు.
ముఖ్యమంత్రి జగన్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎంపీ నివాసానికి వెళ్లారు. ఈనెల 17వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ముందుగా నోటీసులు తనకు ఇవ్వాలని.. రఘురామ కుమారుడు కోరగా.. ఎంపీకే నోటీసులు ఇస్తామని సీఐడీ అధికారులు స్పష్టంచేశారు. అనంతరం రఘురామకు నోటీసులు ఇచ్చి అధికారులు వెళ్లిపోయారు. ఈ క్రమంలో మరోసారి.. రఘురామ ప్రభుత్వ తీరుపైనా.. సీఐడీ తీరుపైనా అనుమానాలు వ్యక్తం చేయడం గమనార్హం.