వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏకంగా జగన్మోహన్ రెడ్డి నే సవాలు చేశారు. తనపై అనర్హత వేటు వేయించటానికి ఫిబ్రవరి 5వ తేదీని డెడ్ లైన్ గా చెప్పారు. ఫిబ్రవరి 5వ తేదీలోగా తనపై అనర్హత వేయించాలని చాలెంజ్ చేశారు. ప్రధానమంత్రి, అమిత్ షా, లోక సభ స్పీకర్ ఓంబిర్లా లాంటి వాళ్ళతో ఎన్ని ఫిర్యాదులైనా చేసుకుని తనపై యాక్షన్ తీసుకునేట్లు చేయాలని సవాలు విసరటమే ఆశ్చర్యంగా ఉంది.
రఘురామ చెప్పిన విషయంలో ఒక ఇంట్రస్టింగ్ పాయింట్ ఉంది. అదేమిటంటే తనపై అనర్హత వేటు వేయించటానికి ఫిబ్రవరి 5వ తేదీని డెడ్ లైన్ గా ప్రకటించారు. ఫిబ్రవరి 5వ తేదీనే ఎందుకు డెడ్ లైన్ గా పెట్టుకున్నారో అర్థం కావటం లేదు. ఏదేమైనా బాల్ ఇపుడు జగన్ కోర్టులో పడింది. మరిపుడు ఎంపీ సవాలు స్వీకరిస్తారా ? లేకపోతే ఫిబ్రవరి 5వ తేదీ వరకు వెయిట్ చేస్తారా ? అన్నది చూడాలి.
జగన్ తో వ్యవహారం చెడిన తర్వాత ఎంపీ తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. ఆ తిరుగుబాటు ముందుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మొదలైనా చివరకు జగన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసేవరకు వెళ్ళింది. దాంతో ఇద్దరి మధ్య సమస్య ముదిరి పాకాన పడింది. ఈ విషయాలన్నింటినీ పక్కన పెట్టేసినా రఘురామపైన జగన్ ఎందుకు అనర్హత వేటు వేయించాలేకపోయారన్నది చాలా కీలకం. కేంద్ర ప్రభుత్వంతో జగన్ కి మంచి సంబంధాలే ఉన్నా ఎంపీపై అనర్హత వేటు మాత్రం వేయించలేకపోయారు.
పార్టీయే తనపై సస్పెన్ష్ వేటు వేయాలని ఎంపీ ఇంతకాలం వెయిట్ చేశారు. అయితే పార్టీయేమొ సస్పెన్షన్ కన్నా అనర్హత వేటు వేయించటంపైనే ప్రధానంగా దృష్టిపెట్టింది. ఎంపీపై అనర్హత వేటు వేయించటంలో జగన్ ఒకరకంగా ఫెయిలయ్యారనే అనుకోవాలి. క్షేత్రస్ధాయిలో పరిస్దితి చూస్తుంటే ఢిల్లీ స్ధాయిలో జగన్ కన్నా రఘురామకే ఎక్కువ పట్టుందని అనుకోవాలి. అందుకనే తిరుగుబాటు ఎంపీ విషయంలో జగన్ ప్రయత్నాలేవీ ఫలించలేదు.