త్వరలో జరగబోతోన్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో జనవరి 15 వరకు ర్యాలీలు, రోడ్ షోలు వంటి కార్యక్రమాలపై సీఈసీ నిషేధం విధించింది. జనవరి 15 తర్వాత పరిస్థితిని సమీక్షించి ప్రచారంపై తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. అప్పటిదాకా పార్టీలన్నీ డిజిటల్, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకోవాలని సూచించింది.
ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. దేశంలో డిజిటల్ సమాచార వినియోగం, ఉత్తరప్రదేశ్ లో ఇంటర్నెట్ పరిస్థితులను సీఈసీ గమనించాలని ఒవైసీ అన్నారు. జనవరి 15 తర్వాత ప్రచార మార్గదర్శకాలను సీఈసీ మరోసారి సమీక్షిస్తుందని ఆశిస్తున్నామన్నారు. యూపీలో ప్రతి 100 మందిలో 39 మందే ఇంటర్నెట్ వినియోగిస్తుంటారని అన్నారు.
యూపీలోని ధనిక వర్గాల్లో 19 శాతం మందికి ఇంటర్నెట్ సదుపాయం ఉందని, పేదల్లో 6 శాతం మందికే ఇంటర్నెట్ అందుబాటులో ఉందని తెలిపారు. యూపీ పట్టణ ప్రాంతాల్లో 50 శాతం మహిళలు ఇప్పటివరకు ఇంటర్నెట్ ను వినియోగించలేదని, గ్రామీణ ప్రాంతాల్లో అసలు ఇంటర్నెట్ వినియోగం తెలియని వాళ్లు 76 శాతం మంది ఉన్నారని ఒవైసీ వివరించారు. పట్టణ ప్రాంతాల్లో కనీసం ఒకసారి ఇంటర్నెట్ వాడిన వారి శాతం 54 కాగా, రాష్ట్రంలో 46.5 శాతం మంది మహిళలకే సొంత అవసరాల కోసం ఫోన్లున్నాయని చెప్పారు. ఈ పరిస్థితుల్లో డిజిటల్ ప్రచారం నిర్వహించడం ఎలా అంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఉద్దేశించి ఒవైసీ విమర్శనాత్మకంగా, సెటైరికల్ గా స్పందించారు.