భధ్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ కుటుంబం సూసైడ్ చేసుకోవడానికి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకే కారణమంటూ రిలీజైన రామకృష్ణ సెల్ఫీ వీడియో దుమారం రేపింది. దీంతో, వనమా రాఘవను అరెస్టు చేశారంటూ ప్రచారం జరిగింది. కానీ, వనమా రాఘవ పరారీలో ఉన్నాడని పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు.
ఈ క్రమంలోనే తాజాగా నేడు వనమా రాఘవను పోలీసులు గాలించి పట్టుకొని అరెస్ట్ చేశారు. రాఘవ ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు కొత్తగూడెంలో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఈ క్రమంలోనే వనమా రాఘవకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ఆ తర్వాత వనమా రాఘవను పోలీసులు భద్రాచలం జైలుకు తరలించారు. అయితే, రామకృష్ణను బెదిరించినట్టు రాఘవ అంగీకరించినట్లు తెలుస్తోంది.
మరోవైపు, గతంలో రాఘవపై 11 కేసులున్నట్టు ఏఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో రాఘవతో పాటు మరో 8 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసుకు సంబంధించి రాఘవతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేయగా, మిగిలినవారు పరారీలో ఉన్నారు. రాఘవకు తన అక్క తమ కుటుంబ సమస్యలు చెప్పి పరిష్కారం కోరిందంటూ రామకృష్ణ మరో సెల్ఫీ వీడియో కూడా వైరల్ అయింది. వారిద్దరూ కలిసి తన వాటా ఆస్తి తనకు ఇవ్వకుండా జాప్యం చేశారని, దాంతో తాను అప్పుల ఊబిలో కూరుకుపోయానని చెప్పడం కలకలం రేపింది.