తమ ఇంటి ఆడ పడుచు నారా భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ నాయకులపై గతంలో తీవ్రంగా మండిపడ్డ నందమూరి రామకృష్ణ మరోసారి జగన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసం ఘటనే అందుకు కారణం.
గుంటూరు జిల్లా దుర్గి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసిన ఘటన ఏపీ రాజకీయాల్లో రచ్చకు దారి తీసింది. పట్టపగలే ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించారని ఆయన వైసీపీ కార్యకర్త అని తీవ్ర కలకలం రేగింది. దీంతో సీఎం జగన్ పార్టీ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన టీడీపీ నాయకులు ఆందోళనకు పిలుపిచ్చారు.
ఈ నేపథ్యంలో దుర్గిలో 144 సెక్షన్ విధించిన పోలీసులు.. ముందస్తుగా పలువురు టీడీపీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఆ ఘటన తర్వాత అదే జిల్లాలోని తాడికొండ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహంపై కూడా దాడి జరిగిందని టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
ఈ విషయంపై ఆందోళన చేస్తున్న ఆ పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ విగ్రహాలను ధ్వంసం చేస్తే.. టీడీపీ కార్యాలయాలపై దాడులు చేస్తే అరెస్టులు చేయరు కానీ ఇప్పుడు అన్యాయాన్ని ప్రశ్నిస్తే మాత్రం ఎందుకు అరెస్టు చేస్తున్నారని పోలీసుల తీరుపై మండిపడుతున్నారు.
వైసీపీ ప్రభుత్వం అవినీతి, అరాచకాలతో ఆగ్రహంతో ఉన్న ప్రజల దృష్టిని మరల్చేందుకే ఇలా ఎన్టీఆర్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో నందమూరి రామకృష్ణ వైసీపీఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడిన మహా పురుషుడు ఎన్టీఆర్ విగ్రహాలను ధ్వంసం చేస్తే తెలుగు జాతిని అవమానించడమేనని ఆయన పేర్కొన్నారు. ఎన్టీఆర్ విగ్రహాలపై చేయి వేస్తే తెలుగు జాతి ఊరుకోదని తేల్చి చెప్పారు. విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగులను పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.