దేశ రెండో రాజధానిగా.. హైదరాబాద్ కొలువు దీరనుందా? వివిధ కారణాలతో ఢిల్లీ గ్రాఫ్ పడిపోతున్న నేప థ్యంలో హైదరాబాద్‌ను రెండో రాజధాని చేయాలనే ప్రతిపాదన కేంద్రానికి వెళ్లిందా? ఇటీవల హఠాత్తుగా ఢిల్లీ పర్యటనకు వెళ్లి తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇదే ప్రతిపాదనను తెరమీదకి తెచ్చారా? అంటే.. ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం..
ఔననే
గుసగుస వినిపిస్తోంది. విషయంలోకి వెళ్తే.. దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్‌ను చేయాలనేది ఇప్పుడు తెరమీదికి వచ్చిన అంశం కాదు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజభరణాల రద్దు చట్టం తీసుకువచ్చి.. రాజసంస్థాలను విలీనం చేశారు.
ఈ క్రమంలోనే నిజాం సంస్థానాన్ని కూడా కేంద్రం విలీనం చేసుకునే సమయంలో హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధాని చేయాలన్న ప్రతిపాదన మొగ్గతొడిగింది. దీనికి అప్పట్లో కేంద్ర ప్రభుత్వం.. మరీ ముఖ్యంగా నిజాం సంస్థాన్ని విలీనం చేసే ప్రయత్నాలను సాగించిన మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా అంగీకరించారని చరిత్ర చెబుతోంది. అయితే.. తర్వాత ఏమైందో కానీ.. కేవలం రాష్ట్రపతి భవన్ ఏర్పాటు(బొల్లారం), సైనిక శిక్షణ కేంద్రం ఏర్పాటుతో సరిపెట్టారు. ఇక, అప్పటి నుంచి ఈ ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది. అయితే.. ఇప్పుడు. మరోసారి హైదరాబాద్‌ను రెండో రాజధాని చేయాలనే ప్రతిపాదన తెరమీదికి వచ్చింది.
దీనిని స్వయంగాకేసీఆర్.. ఇటీవల తన ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, హోం మం త్రి అమిత్ షాలకు వివరించారని గుసుగుస. ఈ సందర్భంగా దేశరాజధాని ఢిల్లీ విషయం కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం విపరీతమైన పర్యావరణ కాలుష్యం, గాలి కాలుష్యంతో రాజధాని ముక్కు బిగదీసుకుని.. రోజులు వెళ్లదీస్తోంది. ఇప్పటికే వాహనాల వినియోగంపై సరి-బేసి సంఖ్యల విధానం అమలు చేస్తున్నారు. ఇటీవల వచ్చిన దీపావళిని పూర్తిగా నిషేధించారు. ఇక, పొగమంచు కురుస్తున్న స్థాయి కూడా పర్యావరణం కారణంగా పెరిగిపోయిందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇటీవల.. ఒకింత అనారోగ్యానికి గురైన.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాను తక్షణమే ఢిల్లీ వదిలేసి వెళ్లాలని.. వైద్యులు సూచించడంతో ఆమె అటునుంచి అటే.. గోవాకు వచ్చేశారు. ఇక, ఢిల్లీలో ఉండే.. వివిధ దేశాల రాయబారులు.. శివారు ప్రాంతాల్లో ఉంటున్నారు. విదేశీ పర్యాటకుల సంఖ్య కూడా తగ్గిపోయింది. దీంతో కేంద్ర ప్రభుత్వం రెండో రాజధానిపై దృష్టి పెట్టే అవకాశం ఉందని ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ మరోసారి.. నాటి రాజభరణాల రద్దు సమయంలో జరిగిన అనులిఖిత ఒప్పందంపై దృష్టిపెట్టి.. తీగ కదిలించారని తెలుస్తోంది.
హైదరాబాద్ లో కావాల్సినంత భూములు ఉన్నాయని.. కాబట్టి ఇక్కడ రెండో రాజధాని పెట్టాలని ఆయన ప్రతిపాదించారని అంటున్నారు. హైదరాబాద్ అయితే.. అన్ని విధాలా బాగుంటుందని కూడా కేసీఆర్ వివరించారని సమాచారం. మరి దీనిపై ఏం జరుగుతుందో చూడాలి. కేసీఆర్ ప్రతిపాదన నిజమే అయితే.. హైదరాబాద్ కు ఇప్పుడున్న స్థితి నుంచి మరింత ఉన్నత స్థితికి చేరుకోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.