సంచలన విషయం ఒకటి బయటకు వచ్చింది. ఇందులో నిజం ఎంతన్నది ప్రశ్నే. అయితే.. రాజకీయ సంచనాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే ఒక మీడియా సంస్థకు చెందిన యజమాని తాజాగా తాను రాసిన కాలమ్ లో సంచలన అంశాల్ని ప్రస్తావించారు.
ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ విచారణ వేగంగా సాగుతోంది. త్వరలోనే దీనికి సంబంధించిన సంచలన పరిణామాలు చోటు చేసుకుంటాయని చెబుతున్నారు. ఇలాంటివేళ.. అనూహ్యంగా వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ వర్గాలు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలతో మాట్లాడారని.. కొన్ని వివరాలు సేకరించినట్లుగా చెబుతున్నారు.
తాజాగా.. సీబీఐ వారు కోరితే.. తన స్టేట్ మెంట్ ఇవ్వటానికి షర్మిల సిద్దంగా ఉన్నట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఒక ప్రముఖ మీడియా సంస్థలో పబ్లిష్ అయిన ఒక కాలమ్ లో పేర్కొన్నారు. ఇందులో ఏమేం అంశాల్ని ప్రస్తావించారు? షర్మిలకు.. సీబీఐకి సంబంధించి ఏమేం వ్యాఖ్యలు చేశారన్నది యథాతధంగా చూస్తే..
– కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. తండ్రీకొడుకులను అతి త్వరలో సీబీఐ అధికారులు అరెస్ట్ చేయబోతున్నారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో జగన్ సోదరి షర్మిల సీబీఐ అధికారులకు తన వంతు సహకారం ఇవ్వబోతున్నారని సమాచారం.
– వివేకానందరెడ్డి జీవించి ఉన్నప్పుడు కడప లోక్‌సభ స్థానం నుంచి ‘‘అయితే నువ్వు లేదా నేను పోటీ చేయాలి గానీ.. అవినాశ్‌రెడ్డి పోటీ చేయడం ఏమిటి’’ అని షర్మిల వద్ద పదేపదే ప్రస్తావించేవారని తెలిసింది. అప్పట్లో షర్మిల కూడా ఈ వాదనతో ఏకీభవించారని చెబుతున్నారు. అయితే జగన్‌రెడ్డి మాత్రం బాబాయిని, చెల్లిని కాదని వరుసకు సోదరుడైన అవినాశ్‌రెడ్డి వైపు మొగ్గు చూపారు.
– ఈ విషయం తెలుసుకున్న సీబీఐ అధికారులు అప్పట్లో ఏం జరిగింది? అని షర్మిలను అడిగి తెలుసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం ఉంది. ‘‘కడప నుంచి మనిద్దరిలో ఎవరో ఒకరం పోటీ చేద్దాం’’ అని బాబాయి వివేకానందరెడ్డి సూచించిన విషయం వాస్తవమేనని సీబీఐ అధికారులకు షర్మిల మౌఖికంగా తెలిపినట్టు సమాచారం.
– సీబీఐ అధికారులు అడిగితే స్టేట్మెంట్ రూపంలో కూడా ఇదే విషయాన్ని చెప్పడానికి ఆమె సిద్ధపడుతున్నట్టు తెలిసింది. అదే జరిగితే వివేకానందరెడ్డి హత్యకు మోటివ్ లభించినట్టే అవుతుంది. అప్పుడు అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి చుట్టూ పూర్తిగా ఉచ్చు బిగుసుకుంటుంది. షర్మిల సాక్ష్యం అంటూ చెబితే మాత్రం సీబీఐ అధికారుల విచారణకు బలం చేకూరినట్టవుతుంది.
https://www.youtube.com/watch?v=glEfJhlIB3U&ab_channel=ABNTelugu