టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయిన సంగతి తెలిసిందే. రాధా ఇంటికి స్వయంగా వెళ్లిన చంద్రబాబు…రాధా రెక్కీ ఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాధాతో భేటీ అనంతరం జగన్ సర్కార్ పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాధాపై రెక్కీకి వచ్చిన కారు ఎవరిదో పోలీసులు తేల్చాలని, సెక్యూరిటీ ఇస్తామన్న పోలీసులు అసలు దోషులను తప్పిస్తారా? అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు.
రాధాపై రెక్కీ జరిగిందా లేదా చెప్పాల్సిన బాధ్యత ఎవరిదని చంద్రబాబు ప్రశ్నించారు. రెక్కీపై పోలీసుల దగ్గరున్న ఆధారాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో పోలీసులు కావాలనే కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. రాధాపై రెక్కీ విషయంలో ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రాధాకు హాని తలపెట్టాలని చూసిన దోషులను కాపాడేలా ప్రభుత్వ వైఖరి ఉందని చంద్రబాబు సంచలన ఆరోపణలు చేవారు.
రెక్కీ ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించడం లేదని, వారం గడుస్తున్నా ఇంతవరకు ఏమీ తేల్చలేదని ఆరోపించారు. డీజీపీకి తాను రాసిన లేఖ ఆధారంగా విచారణ చేయలేరా? అని ప్రశ్నించారు. ఇటువంటి ఘటనల్లో కాలయాపన చేయడం మంచిది కాదని చంద్రబాబు హితవు పలికారు. రాధాతో భేటీ అనంతరం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. రాధాకు భద్రత కల్పించినా…ఆయన ఎందుకు తిరస్కరించారో ఇపుడు అర్థం అవుతోందని నెటిజన్లు అంటున్నారు.