ప్రపంచ కుబేరుల్లో ఒకరు.. దేశంలో తిరుగులేని సంపన్నుడు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ అన్న విషయం అందరికి తెలిసిందే. అయితే.. గత ఏడాది ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఏడాది వ్యవధిలో ముకేశ్ అంబానీ కంటే ఎక్కువగా సందపను పోగేసిన రికార్డును ఇద్దరు పారిశ్రామిక వేత్తలు క్రియేట్ చేశారు.
ఏడాది కాలంలో అత్యధిక సంపదను సొంతం చేసుకున్న ఆ ఇద్దరిలో ఒకరు అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీ అయితే.. మరొకరు విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్ జీ.
2021లో ముకేశ్ అంబానీ కంటే ఎక్కువ సంపదను పెంచుకున్నారు. 2021 ఏడాదిలో గౌతమ్ అదీనీ సంపద రూ.3.10 లక్షల కోట్లు. దీంతో ఆయన సంపద ఏకంగా రూ.5.60లక్షల కోట్లకు చేరింది. ఇక.. విప్రో ప్రేమ్ జీ 2021 ఏడాదిలో తన సంపదను రూ.1.18 లక్షల కోట్లకు పెంచుకున్నారు. దీంతో ఆయన ఆస్తి రూ.3.04లక్షల కోట్లకు చేరింది.
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ మాత్రం 2021లో కేవలం రూ.97,500 కోట్ల సంపదను మాత్రమే సంపాదించగలిగారు. అయితే.. మిగిలిన ఇద్దరి కంటే కూడా ఆయన ఆస్తి ఎక్కువగా ఉంది. 2021లో ఆయన ఆస్తి మొత్తం 89.7 బిలియన్ డాలర్లు.. అంటే మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.6.70లక్షల కోట్లుకు చేరింది. చూస్తుంటే.. ముకేశ్ అంబానీ కంటే వేగంగా సంపదనను పెంచుకుంటున్న గౌతమ్ అదానీ దగ్గరకు వచ్చేస్తున్నారు. ఈ ఇద్దరు లక్ష్మీపుత్రుల మధ్య వ్యత్యాసం రూ.1.10 లక్షల కోట్లుగా ఉంది.
2021లో మాదిరే 2022లో గౌతమ్ అదానీ సంపద దూసుకెళితే.. ముకేశ్ ను దాటేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. అదానీ గ్రూపునకు చెందిన చాలా కంపెనీలు 2021లో మదుపరులకు భారీ లాభాల్ని తెచ్చి పెట్టాయి. అదే సమయంలో గౌతమ్ ఆదానీ ఆస్తి భారీగా పెరగటానికి సాయం చేసింది.
అదానీ గ్రూపులో ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్ ప్రైజెస్ షేరు ఏడాది కాలంలో 245 శాతం రాణిస్తే.. అదీనీ ట్రాన్స్ మిషన్ 288శాతం.. అదానీ టోటల్ గ్యాస్ 351.42 శాతం చొప్పున పెరిగాయి. ఇదిలా ఉంటే.. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ఏడాది మొత్తంలో 18.6 శాతం ప్రతిఫలాన్ని అందించాయి.