ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. టికెట్ రేట్ల ధరల తగ్గింపుపై సినీ ప్రముఖులు కొందరు బాహాటంగా స్పందిస్తున్నారు. హీరో నాని, హీరో సిద్ధార్థ్ లతో పాటు మరికొందరు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఇక, ప్రభుత్వ తీరును పలువురు తప్పబడుతున్నా…బయటకు చెప్పుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యవహారంపై ప్రముఖ నిర్మాత, ఏపీ ఫిలిమ్ ఛాంబర్ మాజీ అధ్యక్షులు ఎన్.వి.ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యాఖ్యలు సినీపరిశ్రమను బాధ పెట్టే విధంగా ఉన్నాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. థియేటర్లను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఎన్ వీ ప్రసాద్ అన్నారు. పని ఒత్తిడిలో ఉన్న జాయింట్ కలెక్టర్లను కలిసి విన్నవించుకుంటే ఉపయోగం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. థియేటర్లలో నిబంధనలకు అనుగుణంగా వసతులు కల్పించేందుకు నెల సమయమివ్వడం సంతోషమేనని, కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న థియేటర్ల పరిస్థితి మరింత ఘోరంగా ఉందని అన్నారు.
కరోనాతో రెండేళ్లు నానా ఇబ్బందులు పడ్డామని, ఓటీటీ కారణంగా నష్టాలను చవిచూశామని వాపోయారు. ప్రభుత్వం నియమించిన కమిటీ కాలయాపన చేయకుండా తమ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. ఎవరు పడితే వారు సినీపరిశ్రమ గురించి మాట్లాడవద్దన్నారని వాపోయారు. హీరోలు పరిశ్రమ సమస్యలపై స్పందించడం వల్లే ఈ సమస్య వచ్చిందని వెల్లడించారు.
కరోనా సమయంలో 3 నెలల విద్యుత్ ఛార్జీలు మాఫీ అన్న ప్రభుత్వం ఇప్పటి వరకూ పట్టించుకోలేదని వాపోయారు. థియేటర్లలో టిక్కెట్ల రేట్లపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు. నట్టి కుమార్ ను తెలంగాణలో ప్రత్యేక ఛాంబర్ పెట్టుకోవాలంటూ ప్రసాద్ మండిపడ్డారు.