సొంత లాభం కన్నా, పొరుగు వాడికి సాయపడడంలో ముందుండే ఉత్తర అమెరికా తెలుగు సంఘం(‘తానా’) మరోసారి తన ఉదారత చాటుకుంది. కాలేజీ విద్యార్థులు మరింతగా రాణించాలనే సత్సంకల్పంతో చేయూతను అందించింది. ఆర్థికంగా వారికి ఎలాంటి ఇబ్బందీ రాకుండా చూసే క్రమంలో వారికి స్కాలర్ షిప్పులు మంజూరు చేసింది. నిజానికి ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో ఎంత డబ్బులు ఉన్నా, సరిపోని పరిస్థితి. అదీ ఉన్నత విద్య అయితే, ఖర్చుకు కొలమానం లేకుండా పోయింది. కొందరు పేద వర్గాలకు చెందిన విద్యార్థులు, ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటూ, చదువుకోవాలని ఉన్నా, రాణించలేక పోతున్నారు.
ఈ సమస్యను గుర్తించిన ‘తానా’, అలాంటి విద్యార్థులకు కొన్నేళ్లుగా దన్నుగా నిలుస్తోంది. ఏటా పేద విద్యార్థులను ఎంపిక చేసి, ఆర్థికంగా వారికి సాయం చేస్తోంది. అంతేకాదు, వారికి అవసరమైన నైపుణ్యాల కోసం, ప్రత్యేకంగా తరగతులు నిర్వహించేందుకు కూడా ప్రోత్సహిస్తోంది.
‘తానా’ ఫౌండేషన్ సెక్రటరీ & కోఆర్డినేటర్ ‘శశికాంత్ వల్లేపల్లి’ ఆధ్యర్యంలో హైదరాబాద్ లో ఒక కార్యక్రమం నిర్వహించి, దాత ‘వెంకట్ కోగంటి’ పంపిన లక్షా ఇరవై వేల విలువైన చెక్కులను 10 కళాశాలలకు చెందిన విద్యార్థులకు ‘తానా’ ఫౌండేషన్ చైర్మన్ ‘వెంకట రమణ యార్లగడ్డ’ ద్వారా విద్యార్థులకు పంపిణీ చేశారు.
‘వెంకట రమణ యార్లగడ్డ’ మరియు ‘శశికాంత్ వల్లేపల్లి’ మరియు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. కెరీర్ ఎలా మలుచుకోవాలి, కాలేజీ అనంతర జీవితం ఎలా ఉంటే బాగుంటుందనే విషయాలను విపులంగా వివరించి, విద్యార్థుల్లో చైతన్యం నింపారు.
ఆర్ధిక సహాయం పొందిన విద్యార్థులు దాత ‘వెంకట్ కోగంటి’ కి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్(బీఓడీ) జనార్దన్ నిమమ్మలపూడి, స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ శశాంత్ యార్లగడ్డ పాల్గొన్నారు.