సినిమా టికెట్ రేట్ల తగ్గింపు వ్యవహారంతో పాటు పలు సమస్యలపై చర్చించేందుకు సినిమా డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్ ప్రతినిథులతో ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్నినాని భేటీ అయ్యారు. తమ సమస్యలను, టికెట్ రేట్ల తగ్గింపు వల్ల వచ్చే నష్టాలను మంత్రికి వివరించారు. వారి వినతికి స్పందించిన నాని…డిస్ట్రిబ్యూటర్ల నుంచి వచ్చిన వినతులు ప్రభుత్వ దృష్టిలో ఉన్నాయని, టికెట్ల ధరలపై హైకోర్టు సూచనతో కమిటీ ఏర్పాటు చేశామని వెల్లడించారు.
ఈ కమిటీ సిఫారసుల ప్రకారం సామాన్యులు ఇబ్బంది పడకుండా వినోదాన్ని అందించేలా నిర్ణయం తీసుకుంటామన్నారు. థియేటర్లలో తనిఖీలు, టికెట్ల ధరల విషయంలో ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. నిబంధనలు పాటించాలని చెప్పినా కొన్ని పత్రాలు రెన్యువల్ చేయించుకోనందుకే తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటున్నామన్నారు. లైసెన్స్ లేని 22 థియేటర్లను యాజమాన్యాలే స్వచ్ఛందంగా మూసివేశారన్నారు.
ఏప్రిల్ లో వచ్చిన టికెట్ల జీవోపై 9 నెలల తర్వాత థియేటర్ల యజమానులు నిరసన వ్యక్తం చేస్తున్నాయనడంలో అర్ధం లేదన్నారు. ఇక, హీరో నాని వ్యాఖ్యలపై కూడా పేర్ని నాని స్పందించారు. నాని ఎక్కడ ఉండి.. ఏ షాపులో లెక్కలను దృష్టిలో పెట్టుకోని ఆ కామెంట్స్ చేశారో తనకు తెలియదన్నారు. మద్రాస్ లో ఉండి హీరో సిద్ధార్థ్ మాట్లాడుతున్నారని, తమిళనాడు సీఎం స్టాలిన్, అక్కడి మంత్రులపై అలా మాట్లాడి ఉండొచ్చని అన్నారు.
తమ లగ్జరీ లైఫ్ గురించి ఏపీ సచివాలయానికి వచ్చి తెలుసుకోవాలని చురకలంటించారు. RRR సినిమాపై కూడా ప్రభుత్వం చట్టప్రకారమే మందుకెళ్తుందని, మనిషికో విధంగా తేడాలుండవని చెప్పారు. చంద్రబాబు హయాంలో బాలకృష్ణ సినిమాకు మినహాయింపు ఇచ్చి, చిరంజీవి సినిమాకు ఇవ్వలేదని సంచలన ఆరోపణలు చేశారు. సీఎం జగన్ తో చిరంజీవి భేటీ విషయంపై తనకు సమాచారం లేదని, బహుశా చిరంజీవి నేరుగా సీఎంఓను సంప్రదించి ఉండొచ్చని అన్నారు. అయితే, గతంలో ఎప్పుడో జరిగిపోయిన విషయాన్ని పేర్ని నాని ఇపుడు ప్రస్తావించి చిరు, బాలయ్యల మధ్య చిచ్చు పెట్టారని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.