నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోసం వేల ఎకరాల భూములను త్యాగం చేసిన రైతులకు జగన్ సర్కార్ మొండిచెయ్యి చూపిన సంగతి తెలిసిందే. అమరావతే రాజధాని అనుకొని పచ్చని పొలాలను బీడు భూములుగా మార్చిన రైతన్నలను దగా చేసిన వైసీపీ ప్రభుత్వం….పాలనా రాజధానిని విశాఖకు తరలించేందుకు ప్రయత్నించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తమకు అన్యాయం జరిగిందని, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతులు గత ఏడాదిగా ఉద్యమం చేస్తున్నప్పటికీ సీఎం జగన్ కు చీమ కుట్టినట్టు కూడా లేదు. అమరావతి రైతుల ఉద్యమానికి అనుమతినివ్వకుండా అణగదొక్కాలని చూస్తున్న జగన్ సర్కార్….3 రాజధానులకు మద్దతుగా చేస్తున్న ఉద్యమానికి మాత్రం అడిగిందే తడవుగా అనుమతులిచ్చి తన పక్షపాత ధోరణిని నిరూపించుకుంది.
ఈ నేపథ్యంలోనే జగన్ సర్కార్ కు ఏపీ హైకోర్టు షాకిచ్చింది. అమరావతి రైతుల ఉద్యమం విషయంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. 3 రాజధానులకు మద్దతుగా ఏర్పాటైన శిబిరానికి అనుమతి ఎలా ఇచ్చారని ఏపీ సర్కార్ ను హైకోర్టు ప్రశ్నించింది.
ఏపీలో జరుగుతోన్న ఉద్యమాలకు అనుమతులులల, హెబియస్ కార్పస్ పిటిషన్, రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా లేదా అన్న అంశాలపై విచారణను పున:పరిశీలించాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. జగన్ సర్కార్ దాఖలుల చేసిన పిటిషన్ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. ఏపీలో ఏడాది నుంచి జరుగుతోన్న అమరావతి ఉద్యమానికి ప్రభుత్వం అనుమతివ్వడం లేదని, కానీ, కొద్ది నెలల క్రితం 3 రాజధానుల కోసం ఆందోళన చేస్తున్న వారి ఉద్యమానికి అనుమతులిచ్చారని అమరావతి రైతుల తరఫు న్యాయవాది ప్రణతి ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీంతోపాటు, తాము వస్తుంటే ఆ శిబిరంలోని వారు నల్లబ్యాడ్జీలు చూపిస్తున్నారని హైకోర్టు న్యాయమూర్తులు హైకోర్టు దృష్టికి తెచ్చారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీరుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 3 రాజధానుల శిబిరానికి ఎలా అనుమతిచ్చారని హైకోర్టు ప్రశ్నించింది. ఈ అంశంలో కలెక్టర్, పోలీసులకు నోటీసులు ఇవ్వాల్సి ఉందని, కానీ, తాము సంయమనంతో వ్యవహరిస్తున్నామని హైకోర్టువ్యాఖ్యానించింది.