ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం కాక రేపుతోంది. థియేటర్ కలెక్షన్ల కన్నా
కిరాణా కొట్ల కలెక్షన్లు ఎక్కువగా ఉంటున్నాయంటూ హీరో నాని చేసిన
వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. గతంలోనూ టికెట్ రేట్లపై టాలీవుడ్ కు
చెందిన కొందరు పెదవి విరిచినా…నాని అంత ఓపెన్ గా విమర్శలు చేయలేదు.
అయితే, నాని చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఈ
క్రమంలోనే నాని వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు.
ఇష్టం వచ్చినట్టు సినిమా టికెట్ల రేట్లు పెంచుకుంటామంటే కుదరదని, అలా
చేస్తే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. టికెట్ల రేట్ల విషయంలో ఏవైనా
సమస్యలుంటే జిల్లా స్థాయిలో అధికారులకు నివేదించాలని బొత్స చెప్పారు.
నచ్చిన రేట్లకు సినిమా టికెట్లు అమ్ముకునేందుకు అనుమతిస్తే ఒత్తిళ్లు
లేనట్టా…! ధరలు నియంత్రిస్తే ఒత్తిళ్లు ఉన్నట్టా…! అంటూ బొత్స ఒకింత
ఘాటుగానే స్పందించడం చర్చనీయాంశమైంది.
సామాన్యుడికి అందుబాటులో ఉండాలనే టికెట్ల ధరలు తగ్గించామని, ఇందులో ప్రేక్షకులను అవమానించడం ఏముందని బొత్స ప్రశ్నించారు. మార్కెట్లో వస్తువులకు ఎమ్మార్పీ ఉంటుందని, ఆ పరిమితికి మించి అమ్మకూడదు కదా! అని అన్నారు.
మరోవైపు, నాని వ్యాఖ్యలను టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ తప్పుబట్టారు.
నానికి ఏం తెలుసని మాట్లాడుతున్నారని, నాని వ్యాఖ్యలు ఏపీ ప్రభుత్వాన్ని
కించపరిచేలా ఉన్నాయని నట్టికుమార్ అన్నారు. టికెట్ల రేట్లు, వసూళ్లు,
షేర్ వంటి విషయాలపై అవగాహన లేకుండా నాని మాట్లాడుతున్నారని విమర్శించారు.
తాము ఏపీ ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని, అటు, కోర్టులోనూ ఈ వ్యవహారం
నడుస్తోందని అన్నారు. నాని వ్యాఖ్యల వల్ల మిగతా సినిమాలపై ప్రభావం
పడుతుందని, తన వ్యాఖ్యలపై ఏపీ సర్కారుకు నాని క్షమాపణలు చెప్పాలని
డిమాండ్ చేశారు