టాలీవుడ్ లోని ఈ తరం హీరోలలో చాలామంది స్టార్లుగా కొనసాగుతున్నారు. ఇక, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ ల తరం మొదలుకొని…వైష్ణవ్ తేజ్, అఖిల్ వరకు ఎవరికి వారు వైవిద్యమైన కథలు, కథనాలు ఎంచుకొని సినిమాలు చేస్తున్నారు. అయితే, ఈ 20-20 జమానాలో సోషల్ డ్రామా, క్రైం, థ్రిల్లర్, హారర్, రొమాన్స్, కామెడీ చిత్రాలలో అలవోకగా నటించగలిగిన నటీనటులు టాలీవుడ్ లో ఎందరో ఉన్నారు.
కానీ, తెలుగులో జానపద, పౌరాణిక, చరిత్రాత్మక పాత్రలను అవలీలగా చేయగలిగిన హీరోలను వేళ్లపై లెక్కబెట్టొచ్చు. ఆ హీరోల జాబితాలో నందమూరి నటసింహం బాలయ్య మొదటి స్థానంలో ఉంటారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ హైటెక్ జమానాలో కూడా శ్రీరామ రాజ్యం, పాండు రంగడు, గౌతమి పుత్ర శాతకర్ణి వంటి చిత్రాలను తీసి హిట్ లు కొట్టిన రికార్డు బాలయ్యదే. ఈ కోవలోనే ‘ఆదిశంకరాచార్య’ వంటి భక్తిరస పౌరాణిక చిత్రంలో మరోసారి బాలయ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
‘రామానుజాచార్య’ సినిమాకు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించబోతున్నారని తెలుస్తోంది. బాలకృష్ణ కథానాయకుడిగా ‘పాండురంగడు’ సినిమాను తెరకెక్కించిన దర్శకేంద్రుడు…మరోసారి విభిన్న కథతో రాబోతున్నారు. ‘రామానుజాచార్య’ జీవితాన్ని కథగా మలిచే పనిలో జేకే భారవి బిజీగా ఉన్నారట. గతంలో రాఘవేంద్రరావు తెరకెక్కించిన అన్నమయ్య, శ్రీరామదాసు వంటి భక్తి చిత్రాలకు ఆయన పనిచేశారు. స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటించనున్నారట.